అన్‌క్యాప్డ్‌పై కాసుల వర్షం.. ముగిసిన ఐపీఎల్ మినీ వేలం

by Phanindra |

ఐపీఎల్ మినీ వేలంలో అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లపై కాసుల వర్షం కురిసింది. ఆసీస్ స్టార్ కామెరూన్ గ్రీన్ కూడా రికార్డు ధర పలికాడు.

అన్‌క్యాప్డ్‌పై కాసుల వర్షం.. ముగిసిన ఐపీఎల్ మినీ వేలం
X

దిశ, స్పోర్ట్స్ డెస్క్: ఎప్పట్లాగే ఈసారి కూడా ఐపీఎల్ వేలం కొందరు తెలియని ప్లేయర్ల జాతకాలు మార్చేసింది. ఇప్పటి వరకు వారి పేర్లు కూడా ప్రపంచానికి తెలియని ప్లేయర్లను కోటీశ్వరులను చేసింది. అదే టైంలో మల్టీట్యాలెంటెడ్ ప్లేయర్లపై కాసులు కురిపించింది. అన్ని ఫ్రాంచైజీలూ తమ జట్లలోని లోటుపాట్లను కప్పిపుచ్చే ఆటగాళ్ల కోసం గట్టిగా పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను కేకేఆర్ రూ.25.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ప్లేయర్‌గా నిలిచాడీ ఆసీస్ యంగ్ ప్లేయర్. ఇలా ఈసారి వేలంలో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన బిడ్డింగ్స్ ఏవో చూసేద్దామా..?

అబుదాబి వేదికగా జరిగిన వేలంలో ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ చరిత్ర సృష్టించాడు. రూ.25.20 కోట్లతో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్‌గా నిలిచాడు. భారీ పర్సుతో వేలంలో దిగిన కేకేఆర్ అతన్ని కొనుగోలు చేసింది. ముంబై, రాజస్థాన్ తదితర ఫ్రాంచైజీల నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్న కేకేఆర్.. గ్రీన్‌ను వదలకుండా పట్టుకుంది. అలాగే శ్రీలంక పేసర్ మతీష పతిరాణాను కూడా రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. వీళ్లిద్దరే ఈ మినీవేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు కావడం గమనార్హం.

అన్‌క్యాప్డ్ ప్లేయర్ల హవా

అన్ని ఫ్రాంచైజీలూ స్టార్ ప్లేయర్ల వెంట పడతారనుకుంటే.. ఈసారి వేలంలో దేశవాళీ ప్లేయర్ల కోసం హోరాహోరీ పోరు జరిగింది. రాజస్థాన్ వికెట్ కీపర్ కార్తిక్ శర్మ, యూపీ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్ కోసం గట్టిపోటీ ఎదుర్కొన్న సీఎస్కే.. వీళ్లిద్దర్నీ చెరో రూ.14.20 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ నుంచి కుర్రాళ్లపై ఫోకస్ పెట్టిన ఈ టీం.. ఈసారి కూడా కుర్రప్లేయర్లతో జట్టులో జోష్ నింపేందుకు రెడీ అవుతోంది. తమకు ఇంత భారీ ధర పలుకుతుందని ప్రశాంత్, కార్తీక్ ఇద్దరూ అనుకోలేదు. వీళ్లిద్దరూ కాదు జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ దార్‌కు రూ.8.40 కోట్లు దక్కగా.. మధ్యప్రదేశ్ యంగ్‌స్టర్ మంగేష్ యాదవ్‌కు రూ.5.2 కోట్ల ధర లభించింది. అలాగే ఢిల్లీ వికెట్ కీపర్ తేజస్వి సింగ్ (రూ.3 కోట్లు), రాజస్థాన్ క్రికెటర్ ముకుల్ చౌదరీ (రూ.2.6 కోట్లు) దక్కించుకున్నారు. వీరంతా కేవలం రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలో నిలిచిన వారే కావడం గమనార్హం.

77 - అమ్ముడు పోయిన ప్లేయర్ల సంఖ్య

29 - సోల్డ్ విదేశీ ప్లేయర్లు

రూ. 215.45 కోట్లు - ఫ్రాంచైజీలు ఖర్చు పెట్టిన మొత్తం

Next Story