IPL 2026 Final: స్వల్ప టార్గెట్‌తో బరిలోకి ఆర్సీబీ.. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ వీరంగం

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-31 16:49:10  IST  )

ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ 155 పరుగులకే పరిమితమైంది.

IPL 2026 Final: స్వల్ప టార్గెట్‌తో బరిలోకి ఆర్సీబీ.. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ వీరంగం
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఐపీఎల్-2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లు సత్తా చాటారు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ నిర్ణయాన్ని నిజం చేస్తూ గుజరాత్ టైటాన్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆర్సీబీ ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలవాలంటే 20 ఓవర్లలో 156 పరుగులు చేయాల్సి ఉంది.

వాషింగ్టన్ సుందర్ ఒక్కడే..

గుజరాత్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయిన గుజరాత్.. మిడిల్ ఓవర్లలోనూ పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే, ఓ వైపు పక్క వికెట్లు పడుతున్నా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం చేశాడు. బాధ్యతాయుతంగా ఆడిన సుందర్, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి 37 బంతుల్లో తన హాఫ్ సెంచరీని (50 నాటౌట్) పూర్తి చేసుకున్నాడు. జేసన్ హోల్డర్‌తో కలిసి చివర్లో వేగంగా ఆడటంతో గుజరాత్ జట్టు 150 పరుగుల మార్కును దాటగలిగింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో యువ పేసర్ రసిఖ్ సలామ్ 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 27 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి గుజరాత్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సైతం అద్భుతంగా బౌలింగ్ చేసి 29 పరుగులకు 2 వికెట్లు తీశాడు. ఈ వికెట్లతో భువీ ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు (28 వికెట్లు) తీసిన బౌలర్‌గా నిలిచాడు.

ఆర్సీబీ ఓపెనర్ల దూకుడు..

156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ ఓపెనర్లు కేవలం 4 ఓవర్లలోనే 56 పరుగుల చేశారు. ముఖ్యంగా వెంకటేశ్ అయ్యార్ 15 బంతుల్లో 32 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ కింగ్ కోహ్లీ 11 బంతుల్లో 29 పరుగులు చేశాడు. 4.3 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోయి 62 పరుగులు చేసింది. కింగ్ కోహ్లీ దూకుడు ఇలానే కొనసాగితే.. ఆర్సీబీకి సెకండ్ ఐపీఎల్ ట్రోఫీ ఖాయమని స్పోర్ట్స్ అనలిస్టులు చెబుతున్నారు.

Next Story