ఐపీఎల్ 2026పై బంగ్లాదేశ్‌లో నిషేధం

by Malleboina Mahesh |

క్రికెట్ అభిమానులను విస్మయానికి గురి చేసే సంచలన పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఐపీఎల్ 2026 ప్రసారాలపై తమ దేశంలో పూర్తి నిషేధం విధిస్తూ సోమవారం షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్ 2026పై బంగ్లాదేశ్‌లో నిషేధం
X

దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ అభిమానులను విస్మయానికి గురి చేసే సంచలన పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఐపీఎల్ 2026 ప్రసారాలపై తమ దేశంలో పూర్తి నిషేధం విధిస్తూ సోమవారం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు నుండి బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను అర్ధాంతరంగా తొలగించడమే దీనికి ప్రధాన కారణం చూపింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దారుణాలకు నిరసనగా ముస్తాఫిజుర్‌ను జట్టు నుండి తప్పించాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

బీసీసీఐ తీసుకున్న ఈ కఠిన నిర్ణయానికి కౌంటర్‌గా.. బంగ్లాదేశ్ సమాచార శాఖ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఐపీఎల్ మ్యాచ్‌లను, సంబంధిత కార్యక్రమాలను ప్రసారం చేయకూడదని ఆదేశించింది. మార్చి 26న ఐపీఎల్ ప్రారంభం కానుండగా, ఈ టిట్-ఫర్-టాట్ (Tit-for-Tat) వ్యవహారం ఇరు దేశాల క్రికెట్ సంబంధాల్లో నిప్పు రాజేసింది. మరోవైపు ఈ వివాదం రాబోయే 2026 టీ20 ప్రపంచ కప్‌ను కూడా తాకింది. భారత్‌లో తమకు భద్రత లేదన్న సాకుతో, తమ మ్యాచ్‌లను ఇండియా నుండి వేరే వేదికలకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఐసీసీకి విజ్ఞప్తి చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

దీనిపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలు ముమ్మాటికీ తప్పేనని అంటూనే.. "భారత్ అందరినీ స్వాగతిస్తుంది. కానీ రావడం రాకపోవడం వారి ఇష్టం, నిర్ణయం ఐసీసీదే" అని తేల్చిచెప్పారు. మొత్తానికి రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలు ఇప్పుడు క్రికెట్ మైదానాన్ని తాకడం క్రీడా ప్రపంచంలో కలకలం రేపుతోంది.

Next Story