రాజస్థాన్ కెప్టెన్‌గా సంజూ శాంసన్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-04-03 05:45:44  IST  )

తర్వాతి మ్యాచ్ నుంచి అతడు కెప్టెన్‌గానే కాకుండా వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా చేపడతాడని రాజస్థాన్ రాయల్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

రాజస్థాన్ కెప్టెన్‌గా సంజూ శాంసన్
X

- పంజాబ్ కింగ్స్ మ్యాచ్ నుంచి బాధ్యతలు

- పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు వెల్లడించిన బీసీసీఐ

- మొదటి మూడు మ్యాచ్‌లలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి

దిశ, స్పోర్ట్స్: వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐకి చెందిన జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) ప్రకటించింది. దీంతో అతను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమమం అయ్యింది. ఐపీఎల్ ముందు సంజూ శాంసన్ తన చేతి వేలికి శస్త్ర చికిత్స చేయించుకున్నందున, పూర్తిగా ఫిట్ నెస్ సాధించలేదు. బీసీసీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో రియాన్ పరాగ్‌కు రాయల్స్ యాజమాన్యం తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే ఆర్ఆర్ జట్టు సంజూ శాంసన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దింపి బ్యాటింగ్ చేయించింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తప్ప శాంసన్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో పెద్దగా ప్రభావం చూపలేదు. రెగ్యులర్ కెప్టెన్ లేకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఇక ఇప్పుడు సంజూ తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండటంతో ఇది జట్టుపై పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని భావిస్తున్నారు.

గాయంతో బాధపతుడున్న సంజూ శాంసన్ ప్రస్తుతం కోలుకోవడంతో ఎన్‌సీఏ అతనికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చిందని.. తర్వాతి మ్యాచ్ నుంచి అతడు కెప్టెన్‌గానే కాకుండా వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా చేపడతాడని రాజస్థాన్ రాయల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్‌సీఏ నుంచి వచ్చిన వైద్య బృందం అతని ఫిట్‌నెస్‌ను క్షణ్ణంగా అంచనా వేసిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు చెప్పింది. కాగా, ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి కారణంగా శాంసన్ కుడి చూపుడు వేలికి గాయమైంది. దీంతో అతను శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. 2008లో తొలి ఎడిషన్ ఛాంపియన్ అయిన రాజస్థాన్ రాయల్స్ ఏప్రిల్ 5న ముల్లన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.

Next Story