సన్‌రైజర్స్‌కు వరుసగా రెండో ఓటమి

by Ajay Maddhiboyina |

బౌలింగ్‌లోనూ విఫలమైన సన్‌రైజర్స్ వరుసగా రెండో ఓటమిని కూడగట్టుకుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయంతో రెండో స్థానంలోకి దూసుకొని పోయింది.

సన్‌రైజర్స్‌కు వరుసగా రెండో ఓటమి
X

- రాణించని టాపార్డర్

- ఆదుకున్న అనికేత్ వర్మ

- దూకుడుగా ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్

- 16 ఓవర్లలోనే ఛేదించిన టార్గెట్

- 7 వికెట్ల తేడాతో విజయం

దిశ, స్పోర్ట్స్: సన్‌రైజర్స్ మెరుపులు తొలి మ్యాచ్‌కే పరిమితమయ్యాయి. ఈ సీజన్‌లో ఏదో ఒక మ్యాచ్‌లో 300 పరుగులు చేస్తామని గొప్పగా చెప్పిన సన్‌రైజర్స్ ఆటగాళ్లు.. గత రెండు మ్యాచ్‌లలో 200 కూడా దాటలేదు. ఢిల్లీతో విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో టాపార్డర్ మొత్తం విఫలమైంది. అనికేత్ వర్మ కనుక ఆదుకోకపోయుంటే.. 100 లోపే ఆలౌట్ అయ్యేదేమో. బౌలింగ్‌లోనూ విఫలమైన సన్‌రైజర్స్ వరుసగా రెండో ఓటమిని కూడగట్టుకుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయంతో రెండో స్థానంలోకి దూసుకొని పోయింది.

ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. 164 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు జేక్ ఫ్రేసర్, ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. జేక్ ఫ్రేసర్ 32 బంతుల్లో 38 పరుగులు, ఫాఫ్ డు ప్లెసిస్ 27 బంతుల్లో 50 పరుగులు చేశారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేసర్‌లను జీషన్ అన్సారీ అవుట్ చేశాడు. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ దూకుడుగా ఆడాడు. కేఎల్ రాహుల్ (15) తక్కువ స్కోరుకే అవుటైనా.. ఆ తర్వాత వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి అభిషేక్ పొరెల్ మరో వికెట్ పడకుండా దూకుడుగా ఆడారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం 16 ఓవర్లలో 166 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. జీషన్ అన్సారీకి మూడు వికెట్లు లభించాయి. మిచెల్ స్టార్క్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

విఫలమైన టాపార్డర్..

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మిచెట్ స్టార్క్ ధాటికి బ్యాటింగ్‌లో తడబడింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్ అనికేత్ వర్మ అద్భుతంగగా ఆడాడు. అతనితో పాటు క్లాసెన్ కూడా రాణించడంతో సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేర్ వర్మ (1) తొలి ఓవర్‌లోనే రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్(22), ఇషాన్ కిషన్ (2), నితీశ్ కుమార్ రెడ్డి (0) వరుసగా తక్కువ స్కోర్లకే పెవీలియన్ చేరారు. దీంతో 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి హైదరాబాద్ జట్టు కష్టాల్లోపడింది. ఆ తర్వాత అనికేత్ వర్మ, క్లాసెన్ కలిసి పరుగులు రాబట్టారు. అనికేత్ వర్మ తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపించాడు. కేవలం 41 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్సులు, ఐదు ఫోర్లు ఉన్నాయి. మరో వైపు క్లాసెన్ 19 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అయితే క్లాసెన్ అవుటయ్యాక.. వచ్చిన బ్యాటర్లు ఎవరూ డబుల్ డిజిట్ పరుగులు సాధించడలేదు. దీంతో సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మిచెల్ స్టార్క్ 5, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా.. మోహిత్ శర్మకు ఒక వికెట్ లభించింది.

స్కోర్ బోర్డు :

సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ వర్మ (రనౌట్) 1, ట్రావిస్ హెడ్ (సి) కేఎల్ రాహుల్ (బి) మిచెల్ స్టార్క్ 22, ఇషాన్ కిషన్ (సి) స్టబ్స్ (బి) మిచెల్ స్టార్క్ 2, నితీశ్ కుమార్ రెడ్డి (సి) అక్షర్ పటేల్ (బి) మిచెల్ స్టార్క్ 0, అనికేత్ వర్మ (సి) జేక్ ఫ్రేసర్ (బి) కుల్దీప్ యాదవ్ 74, క్లాసెన్ (సి) విప్రాజ్ నిగమ్ (బి) మోహిత్ శర్మ 32, అభినవ్ మనోహర్ (సి) డుప్లెసిస్ (బి) కుల్దీప్ యాదవ్ 4, పాట్ కమ్మిన్స్ (సి) జేక్ ఫ్రేసర్ (బి) కుల్దీప్ యాదవ్ 4, మల్డర్ (సి) డుప్లెసిస్ (బి) మిచెల్ స్టార్క్ 9, హర్షల్ పటేల్ (సి) అక్షర్ పటేల్ (బి) మిచెల్ స్టార్క్ 8, మహ్మద్ షమి 1 నాటౌట్, ఎక్స్‌ట్రాలు 11; మొత్తం 163/10 (20 ఓవర్లు)

వికెట్ల పతనం : 11-1, 20-2, 25-3, 37-4, 114-5, 119-6, 123-7, 148-8, 162-9, 163-10

బౌలింగ్ : మిచెల్ స్టార్క్ (3.4-0-35-5), ముఖేష్ కుమార్ (2-0-17-0), అక్షర్ పటేల్ (4-0-43-0), విప్రాజ్ నిగమ్ (2-0-21-0), మోహిత్ శర్మ (3-0-25-1), కుల్దీప్ యాదవ్ (4-0-22-3)

ఢిల్లీ క్యాపిటల్స్ : జేక్ ఫ్రేసర్ (సి అండ్ బి) జీషన్ అన్సారీ 38, ఫాఫ్ డుప్లెసిస్ (సి) మడ్లర్ (బి) జీషన్ అన్సారీ 50, అభిషేక్ పోరెల్ 34 నాటౌట్, కేఎల్ రాహుల్ (బి) జీషన్ అన్సారీ 15, ట్రిస్టన్ స్టబ్స్ 21 నాటౌట్, ఎక్స్‌ట్రాలు 8; మొత్తం 166/3(16 ఓవర్లు)

వికెట్ల పతనం : 81-1, 96-2, 115-3

బౌలింగ్ : మహ్మద్ షమీ(3-0-31-0), అభిషేక్ శర్మ (3-0-27-0), పాట్ కమ్మిన్స్ (2-0-27-0), హర్షల్ పటేల్ (3-0-17-0), జీషన్ అన్సారీ (4-0-42-3), వియాన్ మల్డర్ (1-0-16-0)

Next Story