ఇంగ్లాండ్ వికెట్ కీపర్‌ను కొనుగోలు చేసిన కేకేఆర్

by Dishanational3 |
ఇంగ్లాండ్ వికెట్ కీపర్‌ను కొనుగోలు చేసిన కేకేఆర్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024 ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. ఆ జట్టు క్రికెటర్, ఇంగ్లాండ్‌కు చెందిన జేసన్ రాయ్ వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతని స్థానంలో ఇంగ్లాండ్‌కే చెందిన వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్‌ను కేకేఆర్ జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు ఆదివారం ధ్రువీకరించారు.

ఫిల్ సాల్ట్‌కు ఇది రెండో సీజన్ కానుంది. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున అతను అరంగేట్రం చేశాడు. అయితే, గతేడాది డిసెంబర్‌లో వేలానికి ముందు అతన్ని ఢిల్లీ వదిలేసుకుంది. వేలంలోకి వచ్చిన అతన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. తాజాగా ఫిల్ సాల్ట్‌ను బేస్ ప్రైజ్ రూ. 1.5 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది. ఇటీవల టీ20ల్లో ఫిల్ సాల్ట్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది డిసెంబర్‌లో వెస్టిండీస్‌పై వరుసగా రెండు సెంచరీలు బాదాడు. అలాగే, ఐపీఎల్‌లో గతేడాది ఢిల్లీ తరపున 9 మ్యాచ్‌ల్లో 218 పరుగులు చేశాడు. ఈ నెల 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా తొలి మ్యాచ్ ఆడనుంది.

Next Story

Most Viewed