క్రికెట్లో వీడ్కోలు పర్వం.. ఈ ఏడాది ఐదుగురు భారతీయుల రిటైర్‌మెంట్!

by Phanindra |

క్రికెట్లో వీడ్కోలు పర్వం నడుస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే ఐదుగురు భారతీయులు రిటైర్‌మెంట్ ప్రకటించారు!

క్రికెట్లో వీడ్కోలు పర్వం.. ఈ ఏడాది ఐదుగురు భారతీయుల రిటైర్‌మెంట్!
X

దిశ, స్పోర్ట్స్: 2025 ఏడాది గడిచింది సగమే. ఈ ఆర్నెల్ల కాలంలోనే ఎందరో స్టార్ క్రికెట్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పేశారు. కొందరు స్పెసిఫిక్‌గా కొన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటే.. మరికొందరు పూర్తిగా అన్ని ఫార్మాట్లకూ గుడ్‌బై చెప్పేస్తున్నారు. కోహ్లీ, రోహిత్ నుంచి స్టీవ్ స్మిత్, స్టొయినిస్, మాథ్యూస్.. ఇలా ఇప్పటి వరకు ఈ లిస్టులో 16 మంది చేరారు. ఈ ఏడాది ఇంకా సగం ఉండటంతో అప్పట్లోగా మరెంతమంది ఇలా సడెన్‌ రిటైర్‌మెంట్స్‌తో షాకిస్తారో? అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నానడం అతిశయోక్తి కాదు. ఇకపై కోహ్లీ లేని టెస్టులను, మ్యాక్స్‌వెల్ లేని వన్డేలను, పూరన్ లేని టీ20లను చూడటం ఎలా? అని బాధపడుతున్నారు.

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో రిటైర్‌మెంట్ల పర్వం సాగుతోంది. గొప్ప గొప్ప ప్లేయర్లు ఎవరూ ఊహించని విధంగా రిటైర్‌మెంట్ అనౌన్స్ చేస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నుంచి తాజాగా క్లాసెన్, పూరన్ వరకు అందరూ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన వాళ్లే. కొందరు ఆడలేక ఆటకు వీడ్కోలు చెప్తుంటే.. మరికొందరు కాసులు కురిపించే ఫ్రాంచైజీ క్రికెట్ కోసం అంతర్జాతీయ వేదిక నుంచి తప్పుకుంటున్నారు. ఇలా కారణం ఏదైనా సరే.. ఈ ఏడాది ఇప్పటికే 16 మంది స్టార్ ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పారు. వాళ్లెవరంటే..

భారత్ నుంచి ఐదుగురు..

క్రికెట్ అంటే అత్యంత ప్రేమ ఉన్న దేశాల్లో భారత్ నెంబర్ వన్ అని చెప్పాలి. అందుకే మన క్రికెటర్లు కూడా ఆట నుంచి తప్పుకోవడానికి చాలా ఆలోచిస్తారు. కానీ ఈ ఏడాది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇద్దరూ అనూహ్యంగా టెస్టులకు వీడ్కోలు చెప్పేశారు. ఇంగ్లండ్ సిరీస్ ముందు వీళ్లిద్దరూ ఇచ్చిన షాక్ మామూలుది కాదు. జట్టులో వీళ్ల స్థానాలను ఎవరితో భర్తీ చేయాలని బీసీసీఐ కూడా తర్జనభర్జనలు పడుతోంది. అయితే వీళ్లిద్దరే కాదు.. వరుణ్ ఆరోన్, పీయూష్ చావ్లా, వృద్ధిమాన్ సాహా కూడా ఈ ఏడాదే క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశారు. వీళ్లు ముగ్గురూ మొత్తంగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవడం గమనార్హం.

బంగ్లా నుంచి ముగ్గురు..

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్లు తమీమ్ ఇక్బాల్, మహ్మదుల్లా ఇద్దరూ ఆ దేశానికి ఎన్నో విజయాలు అందించారు. అయితే ఇకపై వీళ్ల ఆటను ఆ దేశం ఫ్యాన్స్ చూడలేరు. ఎందుకంటే వీళ్లు పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించేశారు. అలాగే మరో సీనియర్ ప్లేయర్ ముష్ఫికర్ రహీం కూడా వన్డేలకు గుడ్ బై చెప్పేశాడు.

ముగ్గురు ఆసీస్ స్టార్లు..

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు స్టీ్వ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ముగ్గురూ వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో సెమీఫైనల్ మ్యాచ్ అవగానే తను వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు స్మిత్ ప్రకటించాడు. ఇక స్టొయినిస్, మ్యాక్స్‌వెల్ ఇద్దరూ టీ20 ఫార్మాట్‌పై ఫోకస్ పెట్టేందుకే వన్డేలకు గుడ్‌బై చెప్పేశామంటున్నారు. అయితే వీళ్లిద్దరూ కూడా ఫ్రాంచైజీ క్రికెట్‌తో భారీగా సంపాదిస్తున్న నేపథ్యంలో దీని కోసమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు వాదనలు వినిపిస్తున్నాయి.

ఇద్దరు లంకేయులు..

సంగక్కర వంటి దిగ్గజాల శకం ముగిసిన తర్వాత శ్రీలంక క్రికెట్ తడబడుతూనే ఉంది. అలాంటి సమయంలో ఆ జట్టును నిలబెట్టే ప్రయత్నం చేసిన దిముత్ కరుణరత్నే కూడా ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేశాడు. గాలె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుతో తన కెరీర్ ముగించాడు. ఇది అతనికి 100వ టెస్టు కూడా కావడం గమనార్హం. ఆ దేశ స్టార్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ కూడా టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. బంగ్లాదేశ్‌తో గాలే వేదికగా జూన్ 17న మొదలయ్యే టెస్టు తనకు చివరి సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్ అని వెల్లడించాడు.

మూడు దేశాలు.. ముగ్గురు స్టార్లు..

సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. క్రికెట్ బోర్డులో రాజకీయాల కారణంగానే తను ఈ బాధాకర నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. న్యూజిల్యాండ్ లెజెండరీ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించేశాడు. ఇక విండీస్ విధ్వంసకారుడు నికోలస్ పూరన్ రిటైర్‌మెంట్‌ను ఎవరూ ఊహించలేదనే చెప్పాలి. కేవలం 29 ఏళ్ల వయసులోనే అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన అతను.. కేవలం ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడతానని చెప్పాడు. ఇది కేవలం డబ్బు కోసం తీసుకున్న నిర్ణయమా? లేదంటే దీని వెనుక కూడా ఏదైనా కారణం ఉందా? అనేది తెలియాల్సి ఉంది.

ముగించేసిన పూరన్..

అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి తను రిటైర్ అవుతున్నట్లు విండీస్ స్టార్ నికోలస్ పూరన్ ప్రకటించాడు. పొట్టి ఫార్మాట్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పూరన్.. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కారణం చెప్పలేదు. అయితే ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రం ఆడతానని ప్రకటించాడు. విండీస్ తరఫున 106 టీ20 మ్యాచులు ఆడిన పూరన్ 26.14 సగటుతో 2,275 పరుగులు చేశాడు. అలాగే 61 వన్డేల్లో 39.66 సగటుతో 1983 రన్స్ చేశాడు. 2022లో విండీస్ వన్డే, టీ20 జట్లకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. కానీ ఆ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో విండీస్ నిరాశపరచడంతో బాధ్యతవహిస్తూ కెప్టెన్‌గా తప్పుకున్నాడు.

Next Story