- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా కంటే ఇన్‌స్టా మోడల్స్‌కే విలువ.. బ్యాడ్మింటన్ ప్లేయర్లకు గుర్తింపు ఇవ్వడం లేదంటూ సాత్విక్ ఆవేదన

దిశ, స్పోర్ట్స్ : బ్యాడ్మింటన్ ప్లేయర్లకు దేశంలో సరైన గుర్తింపు దక్కడం లేదని భారత డబుల్స్ స్టార్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. బ్యాడ్మింటన్ ఆడటం కంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం బెటర్ అని, తమ కంటే ఇన్‌స్టా మోడల్స్‌కే ప్రాధానత్య ఉందని ఎమోషనల్ అయ్యాడు. ఇటీవల ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నీ థామస్ కప్‌లో భారత జట్టు కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. స్వదేశానికి తిరిగి వచ్చిన వారికి ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికే వారు కరువయ్యారు. కనీసం బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధికారులు కూడా రాలేదు. తాజాగా ఓ జాతీయ మీడియాతో సాత్విక్ మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ దేశంలో బ్యాడ్మింటన్ ప్లేయర్లు ఎదుర్కొంటున్న నిర్లక్ష్యాన్ని వివరించాడు. ‘ఎయిర్‌పోర్టులో మేము బ్యాడ్మింటన్ జట్టు అని ఎవరికీ తెలియదు. ఇమిగ్రేషన్, కౌంటర్, విమానంలో ఎవరికీ తెలియదు. థామస్ కప్ జెర్సీని మేమే డిజైన్ చేసుకున్నాం. సొంతంగా షర్ట్స్ ప్రింట్ చేసుకున్నాం. ఎయిర్‌పోర్టులో నన్ను గానీ, జట్టులోని వారినిగానీ ఒక్కరు కూడా ‘ఎక్కడికి వెళ్తున్నారు?. మీరు బ్యాడ్మింటన్ జట్టా?. ఏదైనా టోర్నీ ఆడుతున్నారా? అని అడగలేదు. గుర్తింపు లేకపోవడం గుండెను కుంగదీస్తుంది.’అని సాత్విక్ భావోద్వేగానికి గురయ్యాడు.
డబ్బు ముఖ్యం కాదు
తమకు డబ్బు అవసరం లేదని, అభిమానం, గుర్తింపు మాత్రమే అడుగుతున్నామన్నాడు. ‘మాకు కావాల్సింది ఒక్క చిన్న పూలగుత్తి. ‘మీ ఆటను రాత్రి చూశాను. అభినందనలు.’అని ఒక్క కామెంట్. అదే ఓడిపోతే వెంటనే కామెంట్ చేస్తారు. తొలి రౌండ్‌లోనే పదే పదే ఓడిపోతున్నారని విమర్శిస్తారు.’అని తెలిపాడు. 2022లో భారత జట్టు తొలిసారిగా థామస్ కప్ విజేతగా నిలిచింది. ఆ విజయం 1983 వరల్డ్ కప్ విక్టరీ క్షణాలతో సమానమని సాత్విక్ చెప్పాడు. 1983 వరల్డ్ కప్ తర్వాత దేశంలో క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందిందని, 2022 తర్వాత బ్యాడ్మింటన్ మాత్రం వృద్ధి సాధించలేదన్నాడు. ఇప్పుడు బ్రాంజ్ మెడల్ గెలిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని, ఇప్పటికైనా మారకపోతే యువ షట్లర్లను ఎవరూ పట్టించుకోరని ఆందోళన వ్యక్తం చేశాడు.
ఇన్‌స్టాలో రీల్స్ చేస్తా
‘హైదరాబాద్‌లో స్నేహితులతో కలిసి డిన్నర్‌కు వెళ్లడమే నాకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే ఏకైక మార్గం. అక్కడ టేబుల్ అడిగితే ‘సార్ సీట్ ఖాళీగా లేదు’అని చెబుతారు. నేనెవరో, నేనేం సాధించానో చెప్పినా వారికి పట్టదు. అదే ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్ మోడల్ వస్తే ‘మేడం మీకు టేబుల్ ఖాళీగా ఉంది’అని తీసుకెళ్లారు. బ్యాడ్మింటన్‌ను వదిలేసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయాలని అప్పుడప్పుడు అనిపిస్తుంది. డ్యాన్స్ చేసి, పాటలు పాడి డబ్బు సంపాదిస్తాను. బ్యాడ్మింటన్‌లో గతంలో మద్దతు, గుర్తింపు లేవు. ఇప్పుడూ లేదు. భవిష్యత్తు తరాలకు కూడా అవి లభించకపోవచ్చు.’అని సాత్విక్ తెలిపాడు. అన్నీ క్రీడలను ప్రభుత్వాలు సమానంగా చూడాలన్నాడు. తోటి క్రీడాకారులకు వారి రాష్ట్రాల్లో పురస్కారాలు లభించాయని, తనకు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏం దక్కలేదని వాపోయాడు.






