500వ విజయం సాధించిన సింధు.. తొలి ప్లేయర్‌గా రికార్డు

by Harish |   (  Updated:2026-01-22 12:38:23  IST  )

500వ విజయం సాధించిన సింధు.. తొలి ప్లేయర్‌గా రికార్డు
X

దిశ, స్పోర్ట్స్ : భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కెరీర్‌లో 500వ విజయాన్ని నమోదు చేసింది. ఇండోనేసియా మాస్టర్స్‌లో రెండో రౌండ్ గెలవడంతో ఆమె ఈ ఫీట్ సాధించింది. ఈ ఘనత నెలకొల్పిన తొలి భారత షట్లర్‌గా రికార్డు సృష్టించింది. ఇండోనేసియా మాస్టర్స్‌లో సింధు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో ఆమె డెన్మార్క్‌ క్రీడాకారిణి లైన్ హోజ్‌మార్క్ జాయర్‌ఫెల్డ్‌ని 21-19, 21-18 తేడాతో ఓడించింది. 43 నిమిషాలపాటు మ్యాచ్ నువ్వానేనా అన్నట్టు సాగింది. డానిష్ ప్లేయర్ గట్టి పోటీనివ్వడంతో సింధు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కానీ, తన అనుభవాన్ని ఉపయోగిస్తూ ఎక్కడా పట్టు కోల్పోకుండా చూసుకుని వరుసగా రెండు గేములు నెగ్గింది. దీంతో మహిళల సింగిల్స్‌లో కెరీర్‌లో 500వ విజయాన్ని పూర్తి చేసింది. కెరీర్ ఆరంభంలో డబుల్స్‌లో సాధించిన విక్టరీలతో కలిపి ఆమె మొత్తం 516 విజయాలు సాధించింది. మొత్తంగా వరల్డ్ బ్యాడ్మింటన్‌లో ఈ ఫీట్ సాధించిన 6వ మహిళల సింగిల్స్ ప్లేయర్‌గా నిలిచింది.

శ్రీకాంత్ ఔట్.. లక్ష్యసేన్ ముందుకు

భారత స్టార్ ప్లేయర్, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారిపట్టాడు. చైనీస్ తైపీకి చెందిన చౌ టియన్ చెన్ చేతిలో 21-11,21-10 తేడాతో ఓడిపోయాడు. ప్రత్యర్థిని శ్రీకాంత్ ఏమాత్రం ఇబ్బందిపెట్టలేకపోయాడు. మరోవైపు, లక్ష్యసేన్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. రెండో రౌండ్‌లో సేన్ 21-10, 21-11 తేడాతో హాంకాంగ్‌కు చెందిన గునవాన్‌పై ఏకపక్ష విజయం సాధించింది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అతను కేవలం 33 నిమిషాల్లోనే నెగ్గాడు.

READ MORE ....

భారత స్టార్ షట్లర్ PV సింధు అరుదైన ఘనత

Next Story