లార్డ్స్‌లో భారత్ రికార్డు అంతంతే.. 19 మ్యాచ్‌లు ఆడితే ఎన్నింట గెలిచిందో తెలుసా?

by Harish |

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో చేజేతులా ఓటమిని కొనితెచ్చుకున్న టీమిండియా రెండో టెస్టులో పుంజుకుంది.

లార్డ్స్‌లో భారత్ రికార్డు అంతంతే.. 19 మ్యాచ్‌లు ఆడితే ఎన్నింట గెలిచిందో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో చేజేతులా ఓటమిని కొనితెచ్చుకున్న టీమిండియా రెండో టెస్టులో పుంజుకుంది. ఎడ్జ్‌బస్టన్‌లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తొలి రోజు నుంచి ఐదో రోజు వరకూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన గిల్ సేన 336 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. ఈ విజయంతో భారత జట్టు ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్నది. ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమవుజ్జీలుగా ఉన్నాయి. గురువారం నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు ప్రతిష్టాత్మక స్టేడియం లార్డ్స్ ఆతిథ్యమివ్వనుంది. క్రికెటర్లకు లార్డ్స్ స్టేడియం చాలా ప్రత్యేకమైనది. ప్రతి క్రికెటర్ అక్కడ ఆడాలనుకుంటాడు. అంతటి ప్రతిష్టాత్మకమైన లార్డ్స్‌ స్టేడియంలో టీమిండియాకు గొప్ప రికార్డేం లేదు. అక్కడ 1932 నుంచి భారత్ ఆడుతోంది. ఇప్పటి వరకు 19 టెస్టులు ఆడగా.. గెలిచింది మాత్రం మూడు టెస్టుల్లోనే. నాలుగు మ్యాచ్‌లను డ్రా చేసుకోగా.. మరో 12 టెస్టుల్లో పరాజయం పాలైంది. అయితే, చివరి మూడు టెస్టుల్లో రెండు గెలవడం లార్డ్స్‌లో భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపేదే. ఎడ్జ్‌బస్టన్‌‌ ప్రదర్శనను పునరావృతం చేస్తే లార్డ్స్‌లో గెలవడం భారత్‌కు పెద్ద కష్టమేమీ కాదు.

ఇప్పుడు గిల్ వంతు

లార్డ్స్ స్టేడియంలో భారత్ మూడు విజయాలను నమోదు చేసింది. 1986లో కపిల్ దేవ్ నాయకత్వంలో టీమిండియా తొలి విజయాన్ని రుచిచూచింది. ఆ తర్వాత లార్డ్స్‌లో మరో గెలుపు కోసం భారత్‌ 28ఏళ్లు వేచిచూడాల్సి వచ్చింది. 2014లో ధోనీ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా లార్డ్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 95 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. ఇక, కోహ్లీ నేతృత్వంలో 2021లో భారత్‌ మరోసారి విజయ పతాకాన్ని ఎగురవేసింది. ఇంగ్లాండ్‌పై 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లార్డ్స్‌లో టీమిండియాకు అదే చివరి విక్టరీ. ఇప్పుడు లార్డ్స్ స్టేడియంలో భారత్‌ను నడిపించే చాన్స్ గిల్‌కు దక్కింది. మూడో టెస్టులో టీమిండియా గెలిస్తే.. లార్డ్స్ స్టేడియం భారత్‌కు విజయాలను కట్టబెట్టిన కెప్టెన్లు కపిల్ దేవ్, ధోనీ, కోహ్లీ వంటి దిగ్గజాల సరసన గిల్ చేరుతాడు.

రాహుల్, సిరాజ్ రిపీట్ చేస్తారా?

2021లో టీమిండియా విజయంలో బ్యాటర్ కేఎల్ రాహుల్, పేసర్ మహ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్(129) సెంచరీతో కదం తొక్కాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ(88)తో కలిసి తొలి వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం జత చేశాడు. అలాగే, జట్టు 364 పరుగులు చేయడంలో అతనిదే ముఖ్య పాత్ర. ఇక, సిరాజ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సత్తాచాటాడు. ఏకంగా 8 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ప్రస్తుత భారత జట్టులోనూ వీరిద్దరూ ఉన్నారు. అంతేకాకుండా, మంచి ఫామ్‌లో కూడా ఉన్నారు. తొలి టెస్టులో సెంచరీ చేసిన రాహుల్.. రెండో టెస్టులో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఎడ్జ్‌బస్టన్ మ్యాచ్‌లో సిరాజ్ 7 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో లార్డ్స్ స్టేడియంలో వీరిద్దరూ మరోసారి తమ ప్రదర్శనను పునరావృతం చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

లార్డ్స్‌‌లో గ్రీన్ పిచ్!

రెండో టెస్టులో భారీ పరాభవం చూసిన ఇంగ్లాండ్ మూడో టెస్టులో ఎలాగైనా గెలవాలని చూస్తోంది. తమకు అనుకూలంగా పిచ్ తయారు చేయాలని ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక‌ల్లమ్ లార్డ్స్ క్యూరేటర్లను అభ్యర్థించినట్టు తెలుస్తోంది. పేస్‌కు సరిపోయే పిచ్‌ను సిద్ధం చేయాలని కోరాడట. సహజంగా ఇంగ్లాండ్ పిచ్‌లు పేస్‌కు, స్వింగ్‌‌కు అనుకూలం. బంతి ఎటు తిరుగుతుందో తెలియదు. కానీ, తొలి రెండు టెస్టుల్లో భారత బ్యాటర్లు అలవోకగానే పరుగులు సాధించారు. ఈ నేపథ్యంలో లార్డ్స్ పిచ్‌ గురించి ప్రత్యేకంగా మెక‌ల్లమ్ దృష్టి పెట్టాడు. క్యూరేటర్ గ్రీన్ పిచ్‌ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మంగళవారం పిచ్‌ను పరిశీలించారు. పిచ్‌పై ఎక్కువగా గ్రాస్ ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో గత రెండు మ్యాచ్‌లతో పోలిస్తే ఈ పిచ్‌ పేసర్లకు మరింత అనుకూలంగా ఉండనుంది. కాబట్టి, భారత్‌ బ్యాటర్లకు సవాల్ తప్పదు. మరోవైపు, పేసర్‌కు ఎక్కువ సహకారం అందితే అది భారత్‌కు కూడా లాభమే. రెండో టెస్టులో విశ్రాంతి తీసుకున్న బుమ్రా మూడో టెస్టు ఆడతాడని గిల్ ఇప్పటికే ధ్రువీకరించాడు. ఇంతకుముందు బుమ్రా ఒక్కడే ఇంగ్లాండ్‌కు టెన్షన్. కానీ, ఇప్పుడు అతనికి సిరాజ్, ఆకాశ్ దీప్‌ కూడా తోడయ్యారు. రెండో టెస్టులో సిరాజ్ 7 వికెట్లు, ఆకాశ్ దీప్ 10 వికెట్లు తీశారు. ఈ క్రమంలో మూడో టెస్టులో బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ త్రయాన్ని ఎదుర్కోవడం ఇంగ్లాండ్‌కు సవాలే.


Next Story