Asia Cup : ఆసియా కప్‌లో టీమిండియాకు తిరుగులేని రికార్డు.. అన్ని సార్లు టైటిల్ గెలిచిందా?

by Harish |

ఆసియా కప్‌లో టీమ్ ఇండియాకు తిరుగులేని రికార్డు ఉంది.

Asia Cup : ఆసియా కప్‌లో టీమిండియాకు తిరుగులేని రికార్డు.. అన్ని సార్లు టైటిల్ గెలిచిందా?
X

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్పా.. అయితే టైటిల్ మనదే.. భారత క్రికెట్ అభిమానుల ధీమా ఇది. ఫ్యాన్సే కాదు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు టీమిండియానే ఫేవరెట్ అని చెబుతున్నారు. అంత నమ్మకంగా ఉండటానికి టోర్నీలో టీమిండియా‌కు ఉన్న తిరుగులేని రికార్డే కారణం. ఆసియా కప్‌ ప్రారంభం నుంచి టీమిండియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 1984‌ నుంచి ఆసియా కప్ మొదలైంది. తొలి ఎడిషన్‌లోనే భారత్ టైటిల్ సాధించింది. ఇప్పటివరకు 16 ఎడిషన్లు పూర్తవ్వగా ఏకంగా 11 సార్లు ఫైనల్‌కు చేరుకుంది. అందులోనూ 8సార్లు(1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018, 2023)టైటిల్ గెలవడం విశేషం. ఆసియా కప్‌లో అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన జట్టు టీమిండియానే. ఆసియా కప్‌లో ఘనమైన రికార్డు కలిగిన భారత్ ఇప్పుడు 9వ టైటిల్‌పై కన్నేసింది. మంగళవారం నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుంది. ఈ సారి కూడా సూర్య సేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది.

చెక్కుచెదరని భారత్ రికార్డులు

1.టీమిండియా 8సార్లు ఆసియా కప్ గెలిచింది. టోర్నీలో అత్యధికసార్లు టైటిల్ గెలిచిన జట్టు‌గా టీమిండియా రికార్డు కలిగి ఉంది. భారత్ తర్వాత శ్రీలంక సెకండ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టుగా ఉంది. ఆ జట్టు 6సార్లు విజేతగా నిలిచింది. పాకిస్తాన్ రెండో సార్లు గెలిచింది.

2. ఆసియా కప్ వరుసగా మూడు సార్లు గెలిచిన ఏకైక జట్టు భారతే. వరుసగా 1988, 1990-91, 1995లలో విజేతగా నిలిచింది.

3. ఆసియా కప్‌లో భారీ విజయం(పరుగుల పరంగా) సాధించిన రికార్డు కూడా టీమిండియా పేరిటే ఉంది. 2008లో హాంకాంగ్‌పై 256 పరుగుల తేడాతో గెలిచింది.

4. అతి తక్కువ బంతుల్లో ఫైనల్ గెలిచిన రికార్డు భారత్ సొంతం .2023లో శ్రీలంకతో జరిగిన టైటిల్ పోరులో ఈ ఘనత సాధించింది. అప్పుడు శ్రీలంక 50 పరుగులకే ఆలౌటవ్వగా.. లక్ష్యాన్ని టీమిండియా 37 బంతుల్లోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది.

5. ఆసియా కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. ఆసియా కప్‌లో అతను 37 మ్యాచ్‌లు ఆడి 40 సిక్సర్లు బాదాడు.

Next Story