మగ బిడ్డకు జన్మనిచ్చిన భారత స్టార్ రెజ్లర్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-02 05:14:26  IST  )

భారత స్టార్‌ రెజ్లర్, హర్యానా ఎమ్మెల్యే వినేశ్ ఫోగట్‌-సోమవీర్‌ దంపతులు తల్లిదండ్రులయ్యారు.

మగ బిడ్డకు జన్మనిచ్చిన భారత స్టార్ రెజ్లర్
X

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్‌ రెజ్లర్ (Indian star wrestler), హర్యానా ఎమ్మెల్యే వినేశ్ ఫోగట్‌-సోమవీర్‌ (Vinesh Phogat-Somavir) దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో వినేశ్ ఫోగట్ పండంటి ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను వినేశ్ అన్నయ్య హర్విందర్ ఫోగట్ మీడియాకు తెలిపారు. 'వినేశ్ ఈ ఉదయం బాబుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. త్వరలోనే వినేశ్‌ను సోమ్‌వీర్ ఇంటికి తీసుకువస్తాం, ఆమెను, బాబును చూసేందుకు తమ స్వగ్రామమైన బలాలీలోని ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు' అని ఆయన తెలిపారు.

కాగా, జులానా ప్రాంతంలోని బక్తఖేడ గ్రామ నివాసి అయినా సోమ్‌వీర్, వినేశ్‌ రైల్వేలో పని చేస్తున్న సమయంలో కలుసుకున్నారు. మొదట్లో ఇద్దరు స్నేహితులుగా ఉండగా, ఆ కొద్దిరోజులకే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో వినేష్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆ సమయంలో దేశానికి వచ్చిన సమయంలో ఢిల్లీ ఎయిర్‌ పోర్టులోనే వినేశ్‌కు ప్రపోజ్‌ చేసి చేతి వేలికి ఉంగరం తొడిగాడు. అదే ఏడాది డిసెంబర్‌ 14న పెళ్లి చేసుకున్నారు. సోమ్‌వీర్‌ సైతం రెజ్లర్‌ కావడం విశేషం. రెండుసార్లు నేషనల్‌ చాంపియన్‌గా నిలిచాడు. ఇక ఈ ఏడాది మార్చి నెలలోనే వినేశ్ తన గర్భం గురించి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా వినేశ్‌ దంపతులకు సోషల్‌ మీడియా వేదికగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక వినేష్ ఫోగట్ గతేడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో బరువు నిబంధనలు ఉల్లంఘించడంతో 50 కేజీల విభాగం ఫైనల్ నుంచి అనర్హతకు గురై తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆ ఘటన తన క్రీడా జీవితంలో అతిపెద్ద గాయం అని ఆమె అభివర్ణించారు. ఆ తర్వాత ఆమె తన ప్రయాణాన్ని రాజకీయాల వైపు మళ్లించారు. గత సెప్టెంబర్‌లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్‌పై విజయం సాధించారు.

Next Story