సౌతాఫ్రికా ‘ఏ’ జట్టును చిత్తు చేసిన భారత అమ్మాయిలు

by Vinod kumar |

ఈ ఏడాది అండర్-21 హాకీ ఆసియా కప్‌‌కు ముందు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జూనియర్ ఉమెన్స్ హాకీ జట్టు అదరగొట్టింది.

సౌతాఫ్రికా ‘ఏ’ జట్టును చిత్తు చేసిన భారత అమ్మాయిలు
X

జోహన్నెస్‌బర్గ్ : ఈ ఏడాది అండర్-21 హాకీ ఆసియా కప్‌‌కు ముందు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జూనియర్ ఉమెన్స్ హాకీ జట్టు అదరగొట్టింది. ఈ టూరులో దక్షిణాఫ్రికా అండర్-21 టీమ్, ఏ టీమ్‌తో మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్.. నాలుగింట విజయాలు సాధించి.. ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. సోమవారం రాత్రి సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 4-0 తేడాతో విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయిదే పూర్తి ఆధిపత్యం.

13వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచి దీపిక భారత్‌ ఖాతా తెరవగా.. నీలమ్(15), అన్ను(35), సున్‌లితా టోప్పో(50) చెరో ఒక గోల్ చేయడంతో భారత్ సునాయాసంగా గెలిచింది. సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌ను 4-4తో భారత్ డ్రాగా ముగించింది. ఇక, పర్యటనలో ముందుగా సౌతాఫ్రికా అండర్-21తో తలపడిన భారత్ మూడు మ్యాచ్‌లను నెగ్గి క్లీన్ ‌స్వీప్ చేసింది. ఈ ఏడాది జూన్‌లో జరిగే ఆసియా కప్‌కు జపాన్ ఆతిథ్యమిస్తున్నది. ఈ ఈవెంట్ ఎఫ్‌ఐహెచ్ ఉమెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్‌కు అర్హత టోర్నీగా ఉన్నది.

Next Story