- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Women's World Cup : రిచా ఘోష్ పోరాటం వృథా.. భారత్ జోరుకు సౌతాఫ్రికా బ్రేక్
మహిళల వరల్డ్ కప్‌లో భారత్ తొలి ఓటమిని ఎదుర్కొంది.

దిశ, స్పోర్ట్స్ : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో వరుసగా రెండు విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియాకు షాక్.. టోర్నీలో తొలి పరాజయాన్ని చవిచూసింది. విశాఖపట్నంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. గత మ్యాచ్‌ల్లో శ్రీలంక, పాకిస్తాన్‌లపై గెలిచిన భారత జట్టు సౌతాఫ్రికాపై తడబడింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగగా 49.5 ఓవర్లలో 251 పరుగులు చేసి ఆలౌటైంది. మిగతా బ్యాటర్లు నిరాశపర్చిన వేళ రిచా ఘోష్(94) ఒంటరి పోరాటం చేసి జట్టుకు మంచి స్కోరు అందించింది. అయితే, 252 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత జట్టు విఫలమైంది. దీంతో రిచా ఘోష్ శ్రమకు ఫలితం లేకుండా పోయింది. ఛేదనలో నడినె డె క్లెర్క(84 నాటౌట్), కెప్టెన్ వొల్వార్డ్ట్(70)లకుతోడు ట్రైయోన(49) రాణించడంతో సౌతాఫ్రికా మరో 7 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
ఆదుకున్న రిచా ఘోష్
భారత్ ఇన్నింగ్స్‌లో రిచా ఘోష్ ఆటే హైలెట్. ఆమె ఆట గురించి ఎంత పొగిడినా తక్కువే. రిచా విఫలమైతే భారత్ పరిస్థితి మరోలా ఉండేది. ఎందుకంటే మిగతా బ్యాటర్లు దారుణంగా నిరాశపరిచారు. మొదట ఓపెనర్లు ప్రతీక(37), స్మృతి మంధాన(23) జట్టుకు మంచి ఆరంభమే అందించారు. కానీ, భారీ ఇన్నింగ్స్‌గా మల్చడంలో విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. హర్లీన్ డియోల్(13), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(9), రోడ్రిగ్స్(0), దీప్తి శర్మ(4)విఫలమవడంతో 102 పరుగులకే 6 వికెట్లు పడ్డాయి. దీంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడి 150 పరుగుల కూడా చేస్తుందా? అన్న అనుమానాలు కలిగాయి. ఈ సమయంలో రిచా ఘోష్ నేనున్నాంటూ జట్టును ఆదుకుంది. సౌతాఫ్రికా బౌలర్లను చూసి బెదరలేదు. వారిపై ఎదురుదాడికి దిగి మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఆమె ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన రిచా 77 బంతుల్లో 94 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకుంది. రిచా పోరాటంతో భారత్ 251 పరుగులు చేయగలిగింది. ఆమెకు స్నేహ్ రాణా(33) చక్కటి సహకారం అందించింది.
ఛేదనలో వాళ్లిద్దరు
సౌతాఫ్రికా గెలుపులో కెప్టెన్ వొల్వార్డ్ట్(70), నడినె డె క్లెర్క్(84 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. మొదట 252 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాప్రికా తీవ్రంగా తడబడింది. తాజ్‌మిన్ బ్రిట్స్(0), సునె లూస్(5), మారిజన్నె కాప్(20), అన్నెకె బోష్(1), సినాలో జఫ్టా(14) వరుసగా వికెట్లు కోల్పోయారు. దీంతో సౌతాఫ్రికా 81 రన్స్‌కే 5 పడటంతో కష్టాల్లో కూరుకుపోయింది. భారత్ విజయం సులభమే అనిపించింది. కానీ, ఓపెనర్ వొల్వార్డ్ట్(70) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఆమె జట్టును పోటీలోకి తీసుకొచ్చింది. ట్రైయోన్(49) సహకారంతో స్కోరును 150 చేరువ చేసింది. అయితే, వొల్వార్డ్ట్‌కు క్రాంతి చెక్ పెట్టింది. అప్పటి వరకు ఇంకా భారత్ చేతుల్లోనే మ్యాచ్ ఉంది. కానీ, నడినె డె క్లార్క్ భారత్ ఆశలపై నీళ్లు చల్లింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను మలుపు తిప్పింది. కేవలం 54 బంతుల్లోనే 84 రన్స్ చేసిన ఆమె చివరి వరకూ నిలబడి సౌతాఫ్రికాకు విజయాన్ని కట్టబెట్టింది.






