IND U19 vs SA U19 : సౌతాఫ్రికా బౌలర్లను ఊచకోతకోసిన తెలంగాణ కుర్రాడు.. వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన యువ భారత్

by Harish |   (  Updated:2026-01-07 19:21:28  IST  )

IND U19  vs SA U19 : సౌతాఫ్రికా బౌలర్లను ఊచకోతకోసిన తెలంగాణ కుర్రాడు.. వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన యువ భారత్
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికాతో టూరులో భారత అండర్-19 జట్టు అదరగొట్టింది. ఇప్పటికే తొలి రెండు వన్డేలు నెగ్గిన యువ భారత్ వరుసగా మూడో వన్డేలోనూ విజయఢంకా మోగించింది. బుధవారం బెనొని వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 233 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. తెలంగాణ యువ సంచలనం ఆరోన్ జార్జ్(118), వైభవ్ సూర్యవంశీ(127) సెంచరీలతో కదం తొక్కగా వారికి బౌలర్లు తోడవడంతో భారత్‌ ఏకపక్షంగా గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మరో వారం రోజుల్లో ప్రారంభంకానున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌కు ముందు యువ భారత్‌లో ఈ విజయం ఆత్మవిశ్వాసం నింపనుంది. ఆ వరల్డ్ కప్‌లో భారత జట్టు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.

గత రెండు మ్యాచ్‌ల్లాగే మూడో వన్డేలోనూ యువ భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. సౌతాఫ్రికా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ముందుగా బ్యాటింగ్ చేయగా.. ఓపెనర్లు ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ రఫ్పాడించారు. వైభవ్ తన బీకర ఫామ్‌ను కొనసాగిస్తూ సఫారీ బౌలర్లపై పడ్డాడు. ఎడాపెడా సిక్సర్లు దంచాడు. వరుసగా రెండో శతకాన్ని నమోదు చేశాడు. మొత్తంగా 74 బంతుల్లో 127 పరుగులు చేశాడు. ఇక ఆరోన్ జార్జ్ కూడా తానేం తక్కువ కాదని నిరూపించాడు. వైభవ్ సిక్సర్ల మోత మోగిస్తే ఆరోన్ ఫోర్లు బాదాడు. అతని ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు ఉన్నాయి. మొత్తం అతను 118 రన్స్ చేసి అవుటయ్యారు. 25 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన ఆరోన్, వైభవ్ 227 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. మిగతా వారు విలువైన పరుగులు జోడించారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 393 పరుగుల భారీ స్కోరు చేసింది. యూత్ వన్డేల్లో భారత్‌కు ఇది నాలుగో అత్యధిక స్కోరు. అనంతరం భారీ లక్ష్యం ముందు దక్షిణాఫ్రికా తేలిపోయింది. ఆ జట్టు బ్యాటర్లు ఒత్తిడిలో చిత్తయ్యారు. 35 ఓవర్లకే ఆలౌటైన సౌతాఫ్రికా కేవలం 160 పరుగులే చేసింది. టాపార్డర్‌లో ముగ్గురు సింగిల్ డిజిట్‌కే అవుటవగా.. మరో బ్యాటర్ పరుగుల ఖాతా కూడా తెరవలేదు. దీంతో 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు. పౌల్ జేమ్స్(41), డేనియల్ బోస్‌మన్(40), కొర్నె బోతా(36 నాటౌట్) కష్టపడినా.. భారత బౌలర్ల ధాటికి నిలువలేకపోయారు. భారత బౌలర్లు కిషన్ కుమార్ 3, మహ్మద్ ఎనాన్ 2 వికెట్లతో సత్తాచాటారు.

Next Story