- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ind vs SA : టీమిండియా పుంజుకుంటుందా?.. నేడు మూడో టీ20
టీ20 సిరీస్‌లో భారత్, సౌతాఫ్రికా మధ్య నేడు మూడో టీ20 జరగనుంది.

దిశ, స్పోర్ట్స్ : తొలి టీ20 భారత్ గెలిచింది. రెండో టీ20 సౌతాఫ్రికా నెగ్గింది. ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1 సమవుజ్జీలుగా ఉన్నాయి. నేడు ధర్మశాల వేదికగా మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి లీడ్‌లోకి వెళ్లాలని టీమిండియా పట్టుదలతో ఉంది. గత మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శన ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. ముందుగా బంతితో.. ఆ తర్వాత బ్యాటుతో చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓటమి కంటే భారత ప్లేయర్ల ఆడిన తీరు కాస్త ఆందోళనకరంగానే ఉంది. కాబట్టి, మూడో టీ20లో భారత జట్టు లోపాలను సరిదిద్దుకుని మెరుగుపడాల్సిన అవసరం ఉంది.
సూర్య, గిల్.. ఇంకెప్పుడు
టీ20 వరల్డ్ కప్‌కు ఇంకెంతో సమయం లేదు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ సూర్యకుమార్, శుభ్‌మన్ గిల్ ఫామ్ జట్టును టెన్షన్ పెడుతోంది. కొంతకాలంగా వీరిద్దరూ టీ20ల్లో పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగా మారారు. టీ20ల్లో సూర్య హాఫ్ సెంచరీ చేసి ఏడాదవుతోంది. ఈ సిరీస్‌లో సూర్య, గిల్ ప్రదర్శన పేలవంగా ఉంది. సూర్య వరుసగా 12, 5 రన్స్ చేయగా.. గిల్ 4, 0 పరుగులు చేశాడు. దీంతో వీరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ వీరిద్దరు ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప్రపంచకప్ బెర్త్‌లు డౌటే. మరోవైపు, యువ సంచలనం అభిషేక్ శర్మ కూడా ఈ సిరీస్‌లో నిరాశపర్చడం అందరినీ ఆశ్చరిపరుస్తోంది. టీ20ల్లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో స్టార్ అయిపోయిన అతను 17, 17 పరుగులే చేశాడు. అతను కూడా పుంజుకోవాల్సి ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ టాపార్డర్ విఫలమవడం భారత బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మాత్రమే టచ్‌లో ఉన్నారు. జితేశ్, దూబె కూడా పెద్దగా ఆకట్టుకుంది లేదు. మొత్తంగా బ్యాటింగ్ పరంగా భారత జట్టు చాలా మెరుగుపడాలని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
బుమ్రా మ్యాజిక్ ఎక్కడ?
ప్రత్యర్థులకు బుమ్రా అంటే దడ. అతని బౌలింగ్ ఎదుర్కోవాలంటే బెంబేలెత్తిపోవాల్సిందే. అలాంటిది టీ20 సిరీస్‌లో బుమ్రా మ్యాజిక్ కనిపించడం లేదు. తొలి టీ20లో రెండే వికెట్లు తీసిన అతను.. రెండో మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అంతేకాకుండా భారీగా పరుగులు సమర్పించాడు. పవర్ ప్లేలోనే ప్రత్యర్థి జట్టును బలహీనపర్చే అతను ప్రస్తుత సిరీస్‌లో మాత్రం తొలి 6 ఓవర్లలో వికెట్లు తీయలేకపోతున్నాడు. అర్ష్‌దీప్ కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయడం లేదు. మూడో టీ20లో వీళ్లిద్దరూ కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
పిచ్ రిపోర్టు
ఈ మ్యాచ్‌లో టాస్ కీలకం కానుంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం తీవ్రంగా ఉండటమే అందుకు కారణం. మంచు కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం చాలా కష్టతరం. కాబట్టి, చేజింగ్ సులభతరం కానుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువ. 2015లో ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలిచింది.






