- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Champions Trophy : దాయాదుల సమరానికి వేళాయే.. నేడు పాక్‌తో భారత్ ఢీ.. విజయం ఎవరిదో?
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ పోరు నేడు దుబాయ్ వేదికగా జరగనుంది.

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీలో కీలక సమరానికి వేళైంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ పోరు నేడే. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు దుబాయ్ వేదిక. ఎప్పటిలాగే దాయాదుల సమరంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టోర్నీని భారత్ గెలుపుతో ఆరంభించిన విషయం తెలిసిందే. తొలి గ్రూపు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించింది. మరోవైపు, సొంతగడ్డపై ఆరంభ మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌కు షాక్ తగిలింది. న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత్, పాక్ మ్యాచ్ అంటేనే ఇరు జట్ల ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఇరు దేశాల అభిమానుల భావోద్వేగాలతో కూడుకున్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సంబరాల్లో మునిగితే.. ఓడిన జట్టు మాత్రం దారుణంగా ట్రోలింగ్ గురవుతుంది. కాబట్టి, ఏ జట్టూ అంత తేలికగా ఓటమిని అంగీకరించదు. ఒత్తిడిని జయించినే జట్టునే విజయం వరిస్తుంది. అయితే, ఏ రకంగా చూస్తుకున్నా దాయాదుల పోరులో టీమిండియానే ఫేవరెట్. కొంతకాలంగా పాక్‌పై ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ సారి కూడా అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌కు సెమీస్ బెర్త్ కూడా దక్కుతుంది.
భారత్‌కు ఎదురుందా?
ఇంగ్లాండ్‌పై సిరీస్ విజయం సాధించిన భారత్ చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే జోరు కొనసాగించింది. తొలి మ్యాచ్‌లో బంగ్లాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ పరంగా బలంగా ఉంది. గిల్ నిలకడగా రాణిస్తుండటం ప్రధాన బలం. బంగ్లాపై అతను అజేయ శతకంతో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. రోహిత్ కూడా టచ్‌లోనే ఉన్నాడు. ఇంగ్లాండ్‌పై ఫామ్ అందుకున్న అతను బంగ్లాపై 41 రన్స్‌తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ కూడా 41 పరుగులు చేసి ఫామ్ అందుకున్నట్టే కనిపిస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ గత మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే అవుటైనా.. అతని సామర్థ్యంపై జట్టు నమ్మకంగా ఉంది. ఇక, పుంజుకోవాల్సింది కోహ్లీ మాత్రమే. అతను కూడా రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్ పరంగా కూడా జట్టుకు ఢోకా లేదు. బుమ్రా గైర్హాజరుతో ఆందోళన నెలకొన్నప్పటికీ షమీ సంచలన ప్రదర్శనతో అనుమానాలన్నింటిని పటాపంచలు చేశాడు. బంగ్లాపై 5 వికెట్లతో చెలరేగాడు. యువ పేసర్ హర్షిత్ రాణా కూడా 3 వికెట్లతో సత్తాచాటాడు. వారికి పాండ్యాకు తోడైతే పాక్‌కు కష్టాలు తప్పవు. ఇక, స్పిన్నర్ అక్షర్ 2 వికెట్లతో ఆకట్టుకోగా.. జడేజా, కుల్దీప్ వికెట్లు తీయనప్పటికీ పరుగులు కట్టడి చేశారు.
కోహ్లీ కూడా ఫామ్‌లోకి వస్తే..
పాక్‌తో మ్యాచ్ అంటేనే అందరి దృష్టి కోహ్లీపైనే ఉంటుంది. అయితే, అతని ఫామ్ ఆందోళనకరంగానే ఉంది. ఇంగ్లాండ్‌పై చివరి వన్డేలో హాఫ్ సెంచరీ చేసి ఫామ్ అందుకున్నట్టే కనిపించాడు. కానీ, బంగ్లాపై 22 పరుగులే చేసి అవుటయ్యాడు. విరాట్ కూడా రాణిస్తే భారత్‌కు ఢోకా ఉండదు. అతని ఫామ్ ఎలా ఉన్నా పాక్‌తో మ్యాచ్ అంటే రెచ్చిపోతాడు. దాయాదీపై సంచలన ఇన్నింగ్స్‌లతో భారత్‌ను గెలిపించిన సందర్భాలు ఎన్నో. 2023లో జరిగిన ఆసియా కప్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 94 బంతుల్లో 122 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఇక, టీ20 వరల్డ్ కప్-2022లో కోహ్లీ ఇన్నింగ్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేరు. నేటి మ్యాచ్‌లో కూడా కోహ్లీ నుంచి జట్టు, అభిమానులు అలాంటి ప్రదర్శననే ఆశిస్తున్నారు.
పాక్‌పై తీవ్ర ఒత్తిడి
కివీస్ చేతిలో పరాజయంతో పాక్ నైరాశ్యంలో ఉంది. భారత్‌తో మ్యాచ్ ఆ జట్టుకు డూ ఆర్ డైలాంటిది. ఓడితే సెమీస్ ఆశలు గల్లంతు కానున్నాయి. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో నాకౌట్ రౌండ్‌కు కూడా చేరుకోకుండానే నిష్ర్కమిస్తే పాక్‌కు అవమానకరమేనని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌పై తప్పక గెలవాల్సి ఉండటంతో పాక్ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ కీలక మ్యాచ్‌కు ఫకర్ జమాన్ దూరం కావడం దాయాది జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలినట్టైంది. బాబర్ ఆజామ్, రిజ్వాన్, సల్మాన్ అఘాలపైనే పాక్ ఆధారపడి ఉన్నది. షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రవూఫ్ బౌలింగ్‌లో కీలకం కానున్నారు.
ఆఖరి ఐదు వన్డేల్లో భారత్ విజయఢంకా
కొంతకాలంగా పాక్‌పై ఫార్మాట్‌తో సంబంధం లేకుండా భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. వరుసగా గత ఐదు వన్డేల్లో పాక్‌ను చిత్తు చేసింది. ఇది భారత ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపేదే. అయితే, వన్డేల్లో హెడ్ టూ హెడ్ రికార్డ్స్‌లో మాత్రం పాక్‌దే ఆధిపత్యం. ఇరుజట్లు 135 వన్డేల్లో తలపడితే భారత్ 57 విజయాలు నమోదు చేయగా.. పాక్ 73 మ్యాచ్‌ల్లో నెగ్గింది. చాంపియన్స్ ట్రోఫీలోనూ ఆ జట్టుదే కాస్త పైచేయి. టోర్నీలో ఐదు సార్లు ఎదురుపడగా పాక్ మూడుసార్లు గెలిస్తే.. భారత్ రెండింట విజయాలు సాధించింది. అయితే, పాక్ ఆధిపత్యం గతమే. 2017లో ఆ జట్టు భారత్‌పై చివరిసారిగా వన్డే మ్యాచ్ నెగ్గింది. కొంతకాలంగా పాక్‌పై భారత్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండటంతో ఈ సారి కూడా టీమ్ ఇండియానే ఫేవరెట్‌గా కనిపిస్తున్నది.
లైవ్‌స్ట్రీమింగ్ ఎక్కడంటే?
దుబాయ్ వేదికగా భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం. మ్యాచ్ మధ్నాహ్నం 2:30 గంటలకు మొదలవుతుంది. జియోహాట్‌స్టార్‌లో మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించొచ్చు. అలాగే, టెలివిజన్‌లో స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, ఇంగ్లిష్ బాషల్లోనూ మ్యాచ్ లైవ్‌స్ట్రీమింగ్ చేస్తున్నారు.
తుది జట్లు(అంచనా)
భారత్ : రోహిత్(కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్, అక్షర్ పటేల్, పాండ్యా, జడేజా, షమీ, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి
పాకిస్తాన్ : ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజామ్, సౌద్ షకీల్, రిజ్వాన్, అఘా సల్మాన్, కమ్రాన్ గులామ్, ఖుష్‌దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్






