IND VS ENG : జైశ్వాల్, గిల్ జిగేల్.. తొలి రోజు టీమిండియాదే

by Harish |

ఇంగ్లాండ్‌తో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా శుభారంభం చేసింది.

IND VS ENG : జైశ్వాల్, గిల్ జిగేల్.. తొలి రోజు టీమిండియాదే
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా‌దే. మూడు సెషన్లలోనూ ఆధిపత్యమే ప్రదర్శించి మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(127 బ్యాటింగ్), యశస్వి జైశ్వాల్(101) సెంచరీలతో కదం తొక్కడంతో టీమిండియాకు బలమైన పునాది పడింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లోని హెడింగ్లీ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం మొదటి టెస్టు ప్రారంభమైంది. టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోవడవంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్లే కోల్పోయి 359 స్కోరు చేసింది. జైశ్వాల్, గిల్ సెంచరీలకుతోడు రిషబ్ పంత్(65 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. రాహుల్(42) పర్వాలేదనిపించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది.

జైశ్వాల్ సెంచరీతో మొదలుపెట్టాడు

ఇంగ్లాండ్‌లో ఆడటం యశస్వి జైశ్వాల్‌కు ఇదే మొదటిసారి. టెస్టుల్లో బాగానే ఆడుతున్నప్పటికీ అతను ఇంగ్లాండ్‌లో ఎలా ఆడతాడోనన్న ఆందోళన ఉండేది. కానీ, సుదీర్ఘ ఫార్మాట్‌లో తన ఫామ్‌ను కొనసాగిస్తూ రెచ్చిపోయాడు. ముందుగా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(42)తో కలిసి భారత్‌కు శుభారంభం అందించాడు. ముందుగా వీరు నిదానంగా ఆడుతూ క్రీజులో పాతుకపోవడానికి ప్రాధాన్యతనిచ్చారు. మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బంతులను బౌండరీలకు బాదారు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 91 రన్స్ జత చేశారు. బ్రైడన్ కార్సే బౌలింగ్‌లో రాహుల్ అవుటవడంతో ఈ జోడీ విడిపోయింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే సాయి సుదర్శన్(0) డకౌటయ్యాడు. అనంతరం గిల్‌తో కలిసి జైశ్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. బ్రైడెన్ కార్సే, క్రిస్ వోక్స్‌లను లక్ష్యంగా చేసుకుని పరుగులు పిండుకున్నాడు. కార్సే వేసిన 6వ ఓవర్‌లో రెండు ఫోర్లు, 49వ ఓవర్‌లో మూడు ఫోర్లు దంచాడు. వోక్స్ వేసిన 38వ ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టాడు. మిగతా బౌలర్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ఇంగ్లాండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే సెంచరీ నమోదు చేశాడు. అయితే, కాసేపటికే అతన్ని స్టోక్స్ బౌల్డ్ చేశాడు.

గిల్ ధమాకా

ఈ మ్యాచ్‌కు ముందు గిల్‌కు ఇంగ్లాండ్‌లో పేలవ రికార్డే ఉంది. 3 మ్యాచ్‌ల్లో 88 రన్సే చేశాడు. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో తనపై వచ్చిన విమర్శలకు సమాధానమిచ్చాడు. తొలి టెస్టులోనే తన పేలవ రికార్డుకు ముగింపు పలికాడు. సారథ్యం వహిస్తున్న తొలి టెస్టులోనే సెంచరీ చేయడం విశేషం. ఇన్నింగ్స్ ఆద్యంతం గిల్ ఎలాంటి ఒత్తిడికి గురవ్వలేదు. దూకుడుగానే ఆడాడు. మరో ఎండ్‌లో జైశ్వాల్ క్రీజులో పాతుకపోవడంతో గిల్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. జైశ్వాల్ స్టైక్‌రొటేట్ చేస్తుంటే గిల్ బౌండరీలు బాదాడు. వన్డే తరహాలో బ్యాటు ఝుళిపించి ఔరా అనిపించాడు. జైశ్వాల్‌తో కలిసి 129 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. గిల్ కేవలం 56 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం కాస్త నెమ్మదించిన అతను మరో 84 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ తర్వాత టెస్టు కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్‌లోనే శతకం బాదిన ప్లేయర్‌గా గిల్ నిలిచాడు.

పంత్ హాఫ్ సెంచరీ

జైశ్వాల్, గిల్ జట్టును పటిష్ట స్థితిలో నిలబెట్టగా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా సత్తాచాటడంతో తొలి రోజు భారత్‌కు తిరుగులేకుండా పోయింది. పంత్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆరంభంలో తన శైలికి విరుద్ధంగా నిదానంగా ఆడాడు. కానీ, ఆ తర్వాత బ్యాటు ఝుళిపించడం మొదలుపెట్టాడు. 6 ఫోర్లు, 2సిక్సర్లు కొట్టాడు. గిల్, పంత్ కలిసి నాలుగో వికెట్‌కు అజేయంగా 138 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జతచేశారు.

Next Story