శుభారంభం ఎవరిదో?.. నేడు భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20

by Harish |

చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమ్ ఇండియా.. ఇంగ్లాండ్‌తో సమరానికి సిద్ధమైంది.

శుభారంభం ఎవరిదో?.. నేడు భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20
X

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమ్ ఇండియా.. ఇంగ్లాండ్‌తో సమరానికి సిద్ధమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడే తొలి టీ20. ఈ మ్యాచ్‌కు కోల్‌కతా వేదిక. బలబలాల పరంగా ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. అయితే, సొంతగడ్డపై ఆడటం టీమిండియాకు అదనపు బలమే. దానికితోడు గతేడాది టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత్.. టీ20ల్లో కొంతకాలంగా జైత్రయాత్ర కొనసాగిస్తున్నది. ఇది భారత ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపేదే. అయితే, ఇంగ్లాండ్‌ కూడా ఏం తక్కువ కాదు. టెస్టుల్లోనే బజ్‌బాల్‌ ఆటతో దూకుడు ప్రదర్శించే ఆ జట్టును టీ20ల్లో నిలువరించడం అంత సులభం కాదు. కాబట్టి, సూర్యసేన అన్ని విభాగాల్లో రాణిస్తేనే విజయం దక్కుతుంది. సమవుజ్జీలు మధ్య జరిగే ఈ పోరులో ఏ జట్టు శుభారంభం చేస్తుందో చూడాలి.

టీ20ల్లో జోరు కొనసాగుతుందా?

టెస్టుల్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉన్నా.. టీ20ల్లో మాత్రం భారత్‌ది జైత్రయాత్రనే కొనసాగిస్తున్నది. భారత జట్టు చివరిసారిగా 2023లో ఆగస్టులో విండీస్ చేతిలో టీ20 సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత టీమిండియా మరో ద్వైపాక్షిక సిరీస్‌ను కోల్పోలేదు. గతేడాది టీ20 వరల్డ్ కప్ విజయం అనంతరం రోహిత్, కోహ్లీ, జడేజా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యువకులతో కూడిన జట్టు విధ్వంసకర ఆటతీరు కనబరుస్తున్నది. జింబాబ్వే, శ్రీలంక, బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలపై సిరీస్‌లు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇంగ్లాండ్‌పై కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నది. శాంసన్, సూర్యకుమార్,అభిషేక్, రింకు సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మలతో భారత్ బ్యాటింగ్ దళానికి ఢోకా లేదు. షమీ రాకతో బౌలింగ్ బలం పెరిగింది. అర్ష్‌దీప్ సింగ్ కూడా మంచి టచ్‌లోనే ఉన్నాడు.

ఇంగ్లాండ్‌తో జాగ్రత్త

ఇంగ్లాండ్‌ టెస్టుల్లోనే టీ20 తరహాలో ఆడుతుంది. అలాంటి పొట్టి ఫార్మాట్‌లో ఆ జట్టు విధ్వంసాన్ని అంచనా వేయలేం. కాబట్టి, ఆ జట్టుతో జాగ్రత్తగా ఉండాల్సిందే. మ్యాచ్‌ను మలుపుతిప్పే భారీ హిట్టర్లు ఆ జట్టు సొంతం. ఫిలిప్ సాల్ట్, బట్లర్, లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్‌ వంటి హిట్టర్లను కలిగి ఉంది. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈడెన్ గార్డెన్స్‌లో వారి ఊచకోతను అడ్డుకోవడం భారత బౌలర్లకు సవాలే. ఆర్చర్, మార్క్‌వుడ్, అట్కిన్సన్‌లతో ఆ జట్టు బౌలింగ్ దళం కూడా బలంగా ఉంది.

షమీపై అందరి దృష్టి

భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ దాదాపు 14 నెలల తర్వాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నాడు. రీఎంట్రీ తర్వాత అతను ఆడబోతున్న తొలి సిరీస్ ఇదే. 2023లో వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయం, సర్జరీ కారణంగా అతను జాతీయ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన అతను ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు, చాంపియన్స్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. షమీ రాకతో భారత్ బలంగా పెరిగిందనే చెప్పొచ్చు. ఈ సిరీస్‌లో అందరి దృష్టి అతనిపైనే ఉంది. చాంపియన్స్ ట్రోఫీకి ముందు షమీ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. దేశవాళీలో రాణించిన అతను అదే జోరును కొనసాగించాలని చూస్తున్నాడు.

భారత్‌ 13.. ఇంగ్లాండ్ 11

టీ20ల్లో ఇరు జట్ల మధ్య పోరులో టీమిండియాదే కాస్త పైచేయి. భారత్, ఇంగ్లాండ్ ఇప్పటివరకు 24 టీ20లు ఆడాయి. అందులో ఇండయా 13 మ్యాచ్‌ల్లో గెలవగా.. ఇంగ్లాండ్ 11 విజయాలు నమోదు చేసింది.

బ్యాటర్లదే పిచ్

ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామమే అని చెప్పాలి. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 143. కానీ, చాలా సార్లు 200కుపైగా స్కోర్లు నమోదయ్యాయి. మంచు ప్రభావం ఉండొచ్చు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది.

Next Story