ఆస్ట్రేలియా అనే అడ్డుగోడను పడగొట్టి.. ఫైనల్‌లోకి అడుగు పెట్టి..

by Ajay Maddhiboyina |

ఈ విజయంతో భారత జట్టు వరుసగా మూడో సారి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది. ఇవ్వాళ జరగబోయే రెండో సెమీస్ విజేతతో ఆదివారం ఫైనల్ ఆడనుంది.

ఆస్ట్రేలియా అనే అడ్డుగోడను పడగొట్టి.. ఫైనల్‌లోకి అడుగు పెట్టి..
X

- వరుసగా మూడో సారి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమ్ ఇండియా

- సమిష్టిగా రాణించిన బౌలర్లు

- 264 పరుగులకు ఆసీస్ ఆలౌట్

- బ్యాటింగ్‌లో అదరగొట్టిన కోహ్లీ, అయ్యర్, కేఎల్ రాహుల్

దిశ, స్పోర్ట్స్: చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియానే ఫేవరెట్లు.. లీగ్ దశలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా సెమీస్ చేరారు.. ఇక ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనగానే అభిమానుల్లో అలజడి.. గెలుస్తామనే ధీమా ఉన్నా.. ఎక్కడో చిన్న డౌట్. ఆసీస్ అనే అడ్డుగోడను కూలుస్తారా? లేదంటే గతంలో ఐసీసీ టోర్నీల్లాగానే వెనక్కు తిరిగి వస్తారా?.. అంటూ ఆఖరి పరుగు వరకు టెన్షన్ పడ్డారు. మొత్తానికి అభిమానుల అనుమానాలను పటాపంచలు చేస్తూ.. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమిష్టిగా రాణించి సగర్వంగా ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ విజయంతో భారత జట్టు వరుసగా మూడో సారి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది. ఇవ్వాళ జరగబోయే రెండో సెమీస్ విజేతతో ఆదివారం ఫైనల్ ఆడనుంది.

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 265 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ఐదో ఓవర్‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ శుభమన్ గిల్ (8) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఇక దూకుడు మీద కనిపించిన రోహిత్ శర్మ రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్బీగా పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతూ భారత జట్టుకు పరుగులు రాబట్టారు. ఎక్కువగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆసీస్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 91 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు. శ్రేయస్ అయ్యర్ (45) జంపా బౌలింగ్‌లో పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కాసేపు కోహ్లీకి తోడుగా ఉన్నాడు.అక్షర్ (27) అవుటైన తర్వాత కోహ్లీ, రాహుల్ కలిసి దూకుడుగా ఆడారు. అయితే 84 పరుగుల వద్ద ఉండగా కోహ్లీ వెనుదిరిగాడు. దీంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వేగంగా పరులుగు తీయడానికి ప్రయత్నిచారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా మూడు సిక్సులు కొట్టి లక్ష్యానికి చేరువ చేశాడు. ఆఖర్లో హార్దిక్ అవుటైనా.. కేఎల్ రాహుల్ ఒక సిక్సు కొట్టి విజయాన్ని అందించాడు. భారత జట్టు 48.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఆసీస్ బౌలర్లు నాథన్ ఎల్లిస్, అడమ్ జంపా చెరి రెండు వికెట్లు తీయగా.. బెన్ డ్వార్‌షుయిస్‌, కూపర్ కనోలీకి తలా వికెట్ లభించింది. విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఆసీస్‌ను కంగారు పెట్టించిన బౌలర్లు

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. మాథ్యూ షార్ట్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కూపర్ కనోలీ (0) ఖాతా తెరవకుండానే మహ్మద్ షమీ బౌలింగ్‌లో కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడాడు. ప్రమాదకరంగా మారుతున్న ట్రావిస్ హెడ్‌ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ కాసేపు వికెట్లు పడకుండా పరుగులు రాబట్టారు. లబుషేన్ (29) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. జోష్ ఇంగ్లీష్ (11) కూడా తక్కువ పరుగులకే పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్‌తో కలిసి అలెక్స్ కేరీ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతుండటంతో ఒక దశలో ఆసీస్ జట్టు 300 పరుగులు దాటేలా కనిపించింది. స్టీవ్ స్మిత్ (73)ను షమీ బౌల్డ్ చేయడంతో పరుగుల వేగం తగ్గింది. డ్వార్‌షుయిస్(19) పరుగుల వేగం పెంచే క్రమంలో అవుటయ్యాడు. ప్రమాదకరంగా కనిపించిన అలెక్స్ కేరీ (61) రనౌట్ అవడంతో ఆస్ట్రేలియా పూర్తిగా డీలా పడింది. టెయిలెండర్లు జంపా (7), నాథన్ ఎల్లిస్ (10)లు కూడా చేతులెత్తేశారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు మహ్మద్ షమీ 3, రవీంద్ర జడేజా 2, వరుణ్‌ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు.

స్కోర్ బోర్డు :

ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్ (సి) శుభ్‌మన్ గిల్ (బి) వరుణ్ చక్రవర్తి 39, కూపర్ కనోలీ (సి) కేఎల్ రాహుల్ (బి) మహ్మద్ షమి 0, స్టీవ్ స్మిత్ (బి) మహ్మద్ షమి 73, మార్నస్ లబుషేన్ (ఎల్బీడబ్ల్యూ)(బి) రవీంద్ర జడేజా 29, జోష్ ఇంగ్లీష్ (సి) కోహ్లీ (బి) రవీంద్ర జడేజా 11, అలెక్స్ కేరీ రనౌట్ 61, మ్యాక్స్‌వెల్ (బి) అక్షర్ పటేల్ 7, డ్వార్‌షుయస్ (సి) శ్రేయస్ అయ్యర్ (బి) వరుణ్ చక్రవర్తి 19, ఆడమ్ జంపా (బి) హార్దిక్ పాండ్యా 7, నాథన్ ఎల్లిస్ (సి) కోహ్లీ (బి) మహ్మద్ షమీ 10, టి సంగా 1 నాటౌట్, ఎక్స్‌ట్రాలు 7; మొత్తం 264/10 (49.3 ఓవర్లు)

వికెట్ల పతనం : 4-1, 54-2, 110-3, 144-4, 198-5, 205-6, 239-7, 249-8, 262-9, 264-10

బౌలింగ్ : మహ్మద్ షమీ (10-0-48-3), హార్దిక్ పాండ్యా (5.3-0-40-1), కుల్దీప్ యాదవ్ (8-0-44-0), వరుణ్ చక్రవర్తి (10-0-49-2), అక్షర్ పటేల్ (8-1-43-1), రవీంద్ర జడేజా (8-1-40-2)

ఇండియా : రోహిత్ శర్మ (ఎల్బీడబ్ల్యూ)(బి) కూపర్ కనోలీ 28, శుభ్‌మన్ గిల్ (బి) బెన్ డ్వార్‌షుయిస్‌ 8, విరాట్ కోహ్లీ (సి) బెన్ డ్వార్‌షుయిస్‌ (బి) అడమ్ జంపా 84, శ్రేయస్ అయ్యర్ (బి) అడమ్ జంపా 45, అక్షర్ పటేల్ (బి) నాథన్ ఎల్లిస్ 27, కేఎల్ రాహుల్ 42 నాటౌట్, హార్దిక్ పాండ్యా (సి) మ్యాక్స్‌వెల్ (భి) నాథన్ ఎల్లిస్ 28, రవీంద్ర జడేజా 2 నాటౌట్, ఎక్స్‌ట్రాలు 3; మొత్తం 267/6 (48.1 ఓవర్లు)

వికెట్ల పతనం : 30-1, 43-2, 134-3, 178-4, 225-5, 259-6

బౌలింగ్ : బెన్ డ్వార్‌షుయస్ (7-0-39-1), నాథన్ ఎల్లిస్ (10-0-49-2), కూపర్ కనోలీ (8-0-37-1), అడమ్ జంపా (10-0-60-2), తన్వీర్ సంగా (6-0-41-0), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (6.1-035-0), ట్రావిస్ హెడ్ (1-0-6-0)

రికార్డులు :

- ఐసీసీ టోర్నీల్లో నాలుగు సార్లు ఫైనల్‌కు చేరిన మొట్టమొదటి కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు. రోహిత్ కెప్టెన్సీలో 2023 ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్, 2023 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు టీమ్ ఇండియా చేరింది.

- భారత జట్టు దుబాయ్ వేదికలో ఓటమి లేకుండా 9 మ్యాచ్‌లు గెలిచింది. న్యూజీలాండ్ జట్టు డునేదిన్‌లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి మొదటి స్థానంలో ఉంది.

- ఐసీసీ వన్డే టోర్నీల్లో ఆసీస్ జట్టుపై అత్యధిక ఛేజింగ్ ఇదే. గతంలో భారత జట్టు 2011 వరల్డ్ కప్‌లో 261 పరుగులు ఛేజ్ చేసింది. తాజాగా 254 పరుగులు ఛేజ్ చేసి రికార్డు తిరగరాసింది.

Next Story