- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND vs AUS : రెండో టీ20లో భారత్ ఓటమి.. అలవోకగా నెగ్గిన ఆస్ట్రేలియా
రెండో టీ20లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో రెండో టీ20లో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. కనీస పోరాటం చేయని గిల్ సేన ఆసిస్ ముందు నిలువలేకపోయింది. తొలి టీ20 వర్షార్పణమైన విషయం తెలిసిందే. మెల్‌బోర్న్‌లో శుక్రవారం జరిగిన రెండో టీ20లో భారత్ 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో చిత్తయ్యింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 18.4 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్(68) పోరాటంతో ఆ స్కోరైనా దక్కింది. అనంతరం 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కాస్త కష్టపడినా సులభంగానే ఛేదించింది. 13.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కెప్టెన్ మిచెల్ మార్ష్(46) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆసిస్ విజయం సునాయాసమైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో కంగారుల జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అభిషేక్ ఒక్కడే
కొంతకాలంగా టీ20ల్లో గొప్ప ప్రదర్శన చేస్తున్న టీమిండియా మెల్‌బోర్న్‌లో బ్యాటింగ్ పరంగా తేలిపోయింది. అభిషేక్ తప్ప అందరూ చేతులెత్తేశారు. ఆసిస్ బౌలర్ హేజల్‌వుడ్ ఆరంభంలోనే భారత్‌ను దెబ్బకొట్టాడు. గిల్(5), కెప్టెన్ సూర్యకుమార్(1), తిలక్ వర్మ(0)లను పెవిలియన్ పంపాడు. శాంసన్(2), అక్షర్ పటేల్(7) దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత జట్టు 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 100 పరుగుల్లోపే ఆలౌట్ అవడం ఖాయమే అనిపించింది. కానీ, 125 పరుగులైనా చేయడానికి కారణం అభిషేక్. భారత జట్టులో అభిషేక్ ఒంటరి పోరాటం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అతను మాత్రం ఆసిస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 37 బంతుల్లో 68 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతని తర్వాత హర్షిత్ రాణా(35) పర్వాలేదనిపించాడు. స్టార్ బ్యాటర్లు విఫలమైన వేళ హర్షిత్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పాలి. అభిషేక్‌కు మంచి సహకారం అందించాడు. అనంతరం 20 పరుగుల వ్యవధిలోనే మరో 5 వికెట్లు కోల్పోవడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఆట ముగిసింది.
40 బంతులు మిగిలి ఉండగానే..
126 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కాస్త ఇబ్బందిపెట్టారు. కానీ, పూర్తిగా నిలువరించలేకపోయారు. టీమిండియా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసిస్ కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ లక్ష్యాన్ని సులువుగానే ఛేదించింది. ఆ జట్టులో కెప్టెన్ మిచెల్ మార్ష్ చెలరేగాడు. 26 బంతుల్లో 46 రన్స్ చేశాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(28) కూడా దూకుడుగా ఆడాడు. హెడ్‌తో కలిసి మార్ష్ జట్టుకు శుభారంభం అందించాడు. కానీ, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి రాణించడంతో ఆసిస్ కీలక వికెట్లు కోల్పోయింది. కానీ, లక్ష్యం చిన్నది కావడంతో బౌలర్లు ప్రయత్నాలు ఫలించలేదు. ఆసిస్ 40 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.






