Ind U19 vs SA U19 : విశ్వరూపం చూపించిన వైభవ్.. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

by Harish |

Ind U19 vs SA U19 : విశ్వరూపం చూపించిన వైభవ్.. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా పర్యటనలో భారత అండర్-19 జట్టు అదరగొడుతోంది. వరుసగా రెండో వన్డేలోనూ నెగ్గి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది. బెనొనిలో సోమవారం జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా అండర్-19 జట్టుపై యువ భారత్ 19 పరుగుల తేడాతో(డీఎల్‌ఎస్ పద్ధతిలో) విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 245 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్ కిషన్ కుమార్(4/46)తో విజృంభించి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. జాసన్ రౌల్స్(114)ఒక్కడే సౌతాఫ్రికా భారాన్ని మోశాడు. తీవ్ర ఒత్తిడిలో అసాధారణ ప్రదర్శన చేసిన అతను సెంచరీతో రాణించాడు. అతని పోరాటంతోనే సౌతాఫ్రికా 245 పరుగులైనా చేయగలిగింది. ఇతర బ్యాటర్లలో డేనియల్ బోస్‌మన్(31) మినహా ఎవరూ క్రీజులో కూడా నిలువలేకపోయారు. అనంతరం ఛేదనకు దిగిన కాసేపటికే ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. కాసేపటి తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైనప్పటికీ ఓవర్లు కోల్పోవాల్సి వచ్చింది. అంపైర్లు రెండో ఇన్నింగ్స్‌ను 27 ఓవర్లకు కుదించి భారత్ టార్గెట్‌ను 174గా నిర్దేశించారు. ఛేదనలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(68) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో యువ భారత్ అలవోకగా గెలిచింది. కేవలం 2 వికెట్లు కోల్పోయి 176 రన్స్ చేసింది. దీంతో భారత జట్టు సిరీస్‌ను 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. బుధవారం ఆఖరి వన్డే జరగనుంది.

10 సిక్సర్లు.. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ

వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. చేజింగ్‌లో ఎడాపెడా సిక్సర్లు దంచి సౌతాఫ్రికా బౌలర్లను ఊచకోతకోశాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. 50 పరుగుల్లో 48 రన్స్ సిక్సర్ల ద్వారానే రావడం మరో విశేషం. యూత్ వన్డేలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు వైభవ్ పేరిటే ఉంది. గతేడాది ఇంగ్లాండ్‌పై 52 బంతుల్లో శతకం బాదిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 24 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు ఉండటం గమనార్హం. వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత్ విజయం లాంఛనమై పోయింది. అభిగ్యాన్ కుండు(48 నాటౌట్), వేదాంత్ త్రివేది(31 నాటౌట్) నిదానంగా ఆడుతూ మిగతా పని పూర్తి చేశారు. మరో 21 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయ తీరాలకు చేరింది.


Next Story