- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఆసియా కప్ నుంచి భారత్ ఔట్?..
ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్‌పై అనిశ్చితి నెలకొంది.

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్‌పై అనిశ్చితి నెలకొంది. ఈ టోర్నీ నుంచి వైదొలగాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకోవడం వెనుక బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) సర్వసభ్య సమావేశం నిర్వహిస్తుండటమే కారణమని సదరు కథనాలు పేర్కొన్నాయి. బంగ్లాదేశ్‌తో సంబంధాలు అంతంత మాత్రమే ఉండటంతో ఏసీసీ ఏజీఎంను ఢాకాలో నిర్వహించడాన్ని బీసీసీఐ వ్యతిరేకిస్తుంది. ఆసియా కప్ ఆతిథ్య హక్కులు భారత్ వద్దే ఉన్నాయి. కానీ, తటస్థ వేదికైనా యూఏఈలో టోర్నీ నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. షెడ్యూల్ ఇంకా ఖరారు కానప్పటికీ సెప్టెంబర్‌లో టోర్నీని నిర్వహించేందుకు ఏసీసీ ప్రయత్నిస్తోంది. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్ జరగడంపై సందిగ్ధం నెలకొంది.
వన్డే, టీ20 సిరీస్ వాయిదా
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే, ఆ దేశంతో భారత్ సంబంధాలు కూడా క్షీణించాయి. ఇటీవల బంగ్లాదేశ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లను బీసీసీఐ వాయిదా వేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సెప్టెంబర్‌కు పోస్ట్‌పోన్ చేసింది. అందుకు సరైన కారణం వెల్లడించకపోయినా.. బంగ్లాలో రాజకీయ అనిశ్చితి కారణమని తెలుస్తోంది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బంగ్లాదేశ్‌లో పర్యటించకూడదనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
వేదిక మార్చాలని డిమాండ్
ఈ నెల 24న ఢాకాలో ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. బంగ్లాతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండటంతో ఏసీసీ మీటింగ్ వేదికను మార్చాలని బీసీసీఐ డిమాండ్ చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఢాకాలో జరిగితే ఏసీసీ మీటింగ్‌కు హాజరుకామని కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, ఆ మీటింగ్‌లో ఆమోదించిన ఏ తీర్మానాన్ని అయినా బహిష్కరిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపినట్టు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఏసీసీ ప్రెసిడెంట్‌గా జై షా రాజీనామా చేసిన తర్వాత పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఏసీసీ పగ్గాలు చేపట్టారు. ఏసీసీ మీటింగ్‌కు హాజరు కావాలని భారత్‌పై మొహ్సిన్ నఖ్వీ అనవసర ఒత్తిడి తెస్తున్నట్టు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఏసీసీ వేదికను మార్చాలని బీసీసీఐ కోరినా అందుకు నఖ్వీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపాయి. ఈ విషయంలో భారత్‌కు ఇతర క్రికెట్ బోర్డులు కూడా మద్దతు తెలిపాయి. శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, ఒమన్ క్రికెట్ బోర్డులు కూడా ఏసీసీ మీటింగ్‌కు హాజరుకావడానికి నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో ఢాకాలో సమావేశం జరగడంపై సందిగ్ధత నెలకొంది.
ఆసియా కప్‌కు అడ్డంకులు
ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఆసియా కప్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. గంగూలీ సహా పలు దిగ్గజ క్రికెటర్లు పాక్‌తో అన్ని రకాల క్రికెట్ సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఆసియా కప్ నుంచి వైదొలగాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా ఖండించారు. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మరోవైపు, ఇటీవల పాక్‌తో ఆడేందుకు బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఆసియా కప్‌పై అనిశ్చితి తొలిగిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, మొహ్సిన్ నఖ్వీ మొండి వైఖరితో భారత్‌పై అనవసర ఒత్తిడి తేవడంతో మరోసారి టోర్నీపై నీలినీడలు కమ్ముకున్నాయి.






