భారత్ టెస్ట్ పగ్గాలు అతడికే ఇవ్వాలి.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

టెస్ట్ ఫార్మా‌ట్‌కు ఇటీవలే భారత స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

భారత్ టెస్ట్ పగ్గాలు అతడికే ఇవ్వాలి.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టెస్ట్ ఫార్మా‌ట్‌కు ఇటీవలే భారత స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జట్టుకు కొత్త సారథి ఎవరనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ (England) పర్యటన ప్రారంభమవుతోన్న నేపథ్యంలో బీసీసీఐ (BCCI) కెప్టెన్ ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ (Michael Vaughan) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి భారత జట్టు పర్యటనకు వస్తున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ (Virat Kohli)కే కెప్టెన్సీ బాధ్యతలను కట్టబెట్టాలని సూచించారు.

కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్ (Shubhman Gill), రిషభ్ పంత్ (Rishabh Pant) లాంటి వాళ్లు పోటీ పడుతున్నా.. వాన్ మాత్రం కోహ్లీ వైపే మొగ్గు చూపాడు. విరాట్ 2014 నుంచి 2022 వరకు భారత టెస్ట్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడని.. ఇంగ్లాండ్‌లో అతడి ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉందని కామెంట్ చేశాడు. కోహ్లీ నాయకత్వంలో టీమిండియా (Team India) 68 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 40 మ్యాచ్‌లలో విజయం సాధించిందని, 11 మ్యాచ్‌లను డ్రా చేసుకుందని మైకెల్ వాన్ తెలిపాడు. భారత్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ మాత్రమే అర్హుడని మైకెల్ వాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా చెప్పుకొచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా కెప్టెన్సీపై తీవ్ర చర్చ జరుగుతోన్న వేళ వాన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ అవుతోంది.

Next Story