జూలైలో జింబాబ్వే పర్యటనకు టీమ్ ఇండియా.. టీ20 సిరీస్ షెడ్యూల్ ఖరారు

by Harish |

జూలైలో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది.

జూలైలో జింబాబ్వే పర్యటనకు టీమ్ ఇండియా.. టీ20 సిరీస్ షెడ్యూల్ ఖరారు
X

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమ్ ఇండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జూలైలో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. తాజాగా ఈ టూరుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. జింబాబ్వే క్రికెట్ బోర్డు మంగళవారం షెడ్యూల్‌ను రివీల్ చేసింది. జూలై 6 నుంచి 14 వరకు ఐదు టీ20లకు జింబాబ్వే ఆతిథ్యమివ్వనుంది.

ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, రెండు బోర్డుల మధ్య సహకార స్ఫూర్తిని పెంపొందించడం ఈ సిరీస్ లక్ష్యమని జింబాబ్వే క్రికెట్(జెడ్‌సీ) పేర్కొంది. ‘భారత్ ప్రభావం, ఆట పట్ల అంకితభావం ద్వారా క్రికెట్ చాలా ప్రయోజనం పొందుతుంది. జింబాబ్వే పర్యటనకు కట్టుబడి ఉన్నందుకు బీసీసీఐ కృతజ్ఞతలు.’ అని జెడ్‌సీ చైర్మన్ తవెంగ్వా ముకుహ్లానీ తెలిపారు. బీసీసీఐ సెక్రెటరీ జైషా స్పందిస్తూ..‘గ్లోబల్ క్రికెట్ కమ్యూనిటీకి బీసీసీఐ ఎల్లప్పుడూ మార్గదర్శక పాత్ర పోషిస్తుంది. ఇది జింబాబ్వే క్రికెట్ పునర్నిర్మాణ కాలం అని మేము అర్థం చేసుకున్నాం. జింబాబ్వే క్రికెట్‌కు తమ మద్దతు అంతర్జాతీయ వేదికపై క్రికెట్ అభివృద్ధి, శ్రేయస్సు కోసం భాగస్వామ్య దృష్టిని ప్రతిబింబిస్తుంది.’ అని తెలిపారు.

జూలై 6న హరారే వేదికగా తొలి టీ20 మ్యాచ్‌తో సిరీస్ ప్రారంభంకానుంది. ఆ తర్వాత జూలై 7వ, 10వ, 13వ, 14వ తేదీల్లో మిగతా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నింటికీ హరారేనే వేదిక. 2022లో వన్డే సిరీస్ కోసం టీమ్ ఇండియా చివరిసారిగా జింబాబ్వేలో పర్యటించింది. ఈ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే, 2016లో చివరిసారిగా టీ20 సిరీస్‌ కోసం వెళ్లింది. అప్పుడు 2-1తో సిరీస్‌ను దక్కించుకుంది. ఇప్పటివరకు భారత్ మూడుసార్లు(2010, 2015, 2016) పొట్టి మ్యాచ్‌లకు కోసం జింబాబ్వేకు వెళ్లగా.. రెండుసార్లు సిరీస్‌ను దక్కించుకుంది. 2015లో సిరీస్ 1-1తో డ్రా అయ్యింది.

Next Story