భారత్‌ను బంగ్లా అడ్డుకోగలదా?.. హెడ్ టూ హెడ్ రికార్డ్ ఎలా ఉందో తెలుసా?

by Harish |

ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా నేడు భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి.

భారత్‌ను బంగ్లా అడ్డుకోగలదా?.. హెడ్ టూ హెడ్ రికార్డ్ ఎలా ఉందో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఓటమెరుగని జట్టుగా ఎదురులేకుండా సాగుతోంది. గ్రూపు దశను అజేయంగా ముగించగా.. తొలి సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను మరోసారి మట్టికరిపించింది. దూకుడు మీద ఉన్న సూర్య సేన నేడు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఏ రకంగా చూసుకున్న ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్. అటు బ్యాటింగ్ పరంగా, ఇటు బౌలింగ్ పరంగా భారత్‌కు ఢోకా లేదు. అభిషేక్ శర్మ, తిలక్ మంచి ఫామ్‌లో ఉన్నారు. వారికితోడు శుభ్‌మన్ గిల్ కూడా గత మ్యాచ్‌తో పుంజుకున్నాడు. సూర్యకుమార్, శాంసన్ పాక్‌పై విఫలమైనా వారి సామర్థ్యాలపై అనుమానాలు అక్కర్లేదు. పాండ్యా, దూబె, అక్షర్ వంటి ఆల్‌రౌండర్లతో 8వ స్థానం వరకు భారత్‌కు బ్యాటింగ్ సామర్థ్యం ఉంది. ఇక, స్పిన్నర్ కుల్దీప్ తన మాయతో ప్రత్యర్థికి సవాల్ విసరనున్నాడు. అతనికితోడు బుమ్రా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబె, పాండ్యా‌లతో కూడిన భారత్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కోవడం బంగ్లా బ్యాటర్లకు అంత సులభం కాదు. అయితే, బంగ్లా జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. కాబట్టి, ఎప్పటిలాగే టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.

బుమ్రాకు ఏమైంది?

ఆసియా కప్‌లో బుమ్రా ప్రదర్శన గొప్పగా లేదు. నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతను కేవలం 3 వికెట్లే తీయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భారత బౌలింగ్ దళానికి నాయకుడైన బుమ్రా నుంచి జట్టు ఆశిస్తున్న పర్ఫామెన్స్ ఇది కాదు. యూఏఈ లాంటి పసికూనపై అతను కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయడం గమనార్హం. గ్రూపు దశలో పాక్‌పై 2 వికెట్లతో పర్వాలేదనిపించినా సూపర్-4 మ్యాచ్‌లో అదే జట్టుపై తేలిపోయాడు. ఒక్క వికెట్ తీయకపోగా 45 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అసలు బుమ్రాకు ఏమైంది? అన్న ఆందోళన మొదలైంది. ఆసియా కప్‌కు ముందు ఇంగ్లాండ్ పర్యటనలో బుమ్రా రెచ్చిపోయిన విషయం తెలిసిందే. మరి ఆసియా కప్ వచ్చే సరికి అతను తడబడటానికి కారణం ఏమై ఉంటుందన్న చర్చ జరుగుతుంది. నేడు జరిగే బంగ్లాతో మ్యాచ్‌‌లో బుమ్రా మరోసారి తన పవర్ చూపించి జట్టులో మరింత జోష్ పెంచాలని అభిమానులు ఆశిస్తున్నారు.

బంగ్లాలో వీళ్లు డేంజర్

బంగ్లా జట్టును మరి తేలికగా తీసేయడానికి లేదు. చివరి రెండు మ్యాచ్‌ల్లో అఫ్గానిస్తాన్, శ్రీలంకలను ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఆ జట్టు బ్యాటింగ్ పరంగా టీమిండియాకు పోటీనివ్వకపోవచ్చు. కానీ, బౌలింగ్‌తో దెబ్బకొట్టే సామర్థ్యం ఆ జట్టుకు ఉంది. పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. 7 వికెట్లు పడగొట్టాడు. మహెది హసన్, రిషద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్ వంటి టాలెంటెండ్ స్పిన్నర్లు ఉన్నారు. దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో బంగ్లాకు స్పిన్నర్లే బలం. అందుకే ఆ జట్టు ఒకవేళ టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ ఎంచుకోవచ్చు. భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి చేజింగ్‌లో సత్తాచాటాలని ఆలోచిస్తున్నది. బ్యాటర్లలో తౌహిద్ హృదయ్, సైఫ్ హసన్,లిటాన్ దాస్, తాంజిద్ హసన్ ప్రభావం చూపొచ్చు.

లిటాన్ దాస్ ఔట్!

బంగ్లా కెప్టెన్ లిటాన్ దాస్ భారత్‌తో మ్యాచ్‌ ఆడటం అనుమానంగా ఉంది. అతను గాయపడటమే అందుకు కారణం. సోమవారం ప్రాక్టీస్ చేస్తుండగా లిటాన్ వెన్నునొప్పి బాధపడ్డాడు. తన నడుము ఎడమ వైపు అసౌకర్యానికి గురయ్యాడు. ఆ తర్వాత అతను ప్రాక్టీస్ చేయలేదు. వైద్య పరీక్షల తర్వాతే అతను ఆడతాడా?లేదా? అని చెప్పగలమని బంగ్లాదేశ్ బోర్డు తెలిపింది. ఒకవేళ లిటాన్ దాస్ ఆడకపోతే బంగ్లాకు భారీ ఎదురుదెబ్బే.

భారత్ 16.. బంగ్లా 1

టీ20ల్లో బంగ్లాదేశ్‌పై టీమిండియాదే పూర్తి ఆధిపత్యం. ఇరు జట్లు ఇప్పటివరకు 17సార్లు తలపడ్డాయి. అందులో 16 మ్యాచ్‌ల్లో భారత్‌దే గెలుపు. ఒక్కసారి మాత్రమే బంగ్లా గెలిచింది. అది కూడా 2019. ఆ తర్వాత టీమిండియా వరుసగా 8 విజయాలు నమోదు చేసింది.

తుది జట్లు(అంచనా)

భారత్ : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్(కెప్టెన్), సంజూ శాంసన్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి

బంగ్లాదేశ్ : సైఫ్ హసన్, తాంజిద్ హసన్, లిటాన్ దాస్(కెప్టెన్), తౌహిద్ హృదయ్, షామిమ్ హుస్సేన్, జాకెర్ అలీ, మహెది హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, తాంజిమ్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్

Next Story