Women's World Cup : నేడు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తాడోపేడో.. ఆసిస్‌ను టీమిండియా అడ్డుకుంటుందా?

by Harish |

మహిళల ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది.

Womens World Cup : నేడు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తాడోపేడో.. ఆసిస్‌ను టీమిండియా అడ్డుకుంటుందా?
X

దిశ, స్పోర్ట్స్ : మహిళల ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. నేడు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఐసీసీ తొలి టైటిల్ నిరీక్షణకు ఈ సారి ఎలాగైనా తెరదించాలని చూస్తున్న భారత జట్టుకు ఆసిస్ గండంలాంటిదే. ఫైనల్‌ కంటే ముందు భారత్‌కు ఈ మ్యాచ్ మరో ఫైనల్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాకు అతిపెద్ద ముప్పు కంగారుల జట్టే. చాలా ఐసీసీ ఈవెంట్లలో ఏదో ఒక దశలో ఆసిస్‌ దాటడంలో భారత జట్టు తడబడింది. 2005 వరల్డ్ కప్ ఫైనల్‌లో, 2020 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో కంగారులను నిలువరించలేక టైటిల్ చేజార్చుకుంది. 2023 టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌లో టీమిండియాకు ఆస్ట్రేలియా అడ్డుపడింది. అంతేకాకుండా, ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనూ భారత్‌పై ఆ జట్టుదే ఆధిపత్యం. వన్డేల్లో ఇరు జట్లు 60సార్లు ఎదురుపడితే అందులో 49 విజయాలతో ఆసిస్‌దే పైచేయి. భారత్ కేవలం 11 మ్యాచ్‌ల్లోనే నెగ్గింది. కాబట్టి, ప్రమాదకరమైన ఆస్ట్రేలియా‌ను దాటడం భారత్‌కు సవాలే. ఇంతకుముందు లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. సెమీస్‌లో ప్రత్యర్థిని నిలువరించాలంటే భారత్ ముందున్న మార్గం అన్ని విభాగాల్లో రాణించడమే.

స్మృతితోపాటు ఇంకెవరు?

ఓపెనర్ ప్రతీక రావల్ సెమీస్‌కు దూరం కావడం భారత్‌కు భారీ దెబ్బే. మంచి ఫామ్‌లో ఉన్న ఆమె 308 స్కోరు చేసింది. స్మృతి మంధాన(365) తర్వాత భారత్ తరపున అత్యధిక స్కోరర్ ఆమెనే. వీరిద్దరూ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే, గాయం కారణంగా ప్రతీక ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. దీంతో స్మృతి ఒంటరైపోయింది. ఆమెపై అదనపు భారం పడనుంది. స్మృతి, ప్రతీక తర్వాత రిచా ఘోష్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కొన్ని మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే, నిలకడలేమితో ఇబ్బందిపడుతున్నారు. సెమీస్‌లో వీళ్లు బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం ఉంది. లేదంటే భారత్ మరోసారి ప్రపంచకప్ ఆశలను మర్చిపోవాల్సిందే. బౌలింగ్ పరంగా దీప్తి శర్మ, తెలుగమ్మాయి శ్రీచరణి జట్టుకు అండగా నిలుస్తున్నారు. వీరికి క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా కూడా తోడైతే ఆసిస్‌ను నిలువరించడం పెద్ద కష్టమేమీ కాదు.

ఆసిస్‌లో వీళ్లు

ఆస్ట్రేలియా ప్రయాణం ఎదురులేకుండా సాగుతోంది. లీగ్ దశలో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఆ జట్టు చాలా పటిష్టంగా ఉంది. అలీస్సా హీలీ, గార్డ్‌నెర్, బెత్ మూనీ, లిచ్‌ఫీల్డ్ వంటి బ్యాటర్లు ప్రమాదకరం. వీరిలో ఒక్కరు క్రీజులో పాతుకపోయిన భారీ స్కోరు చేయడం ఖాయమే. ఇక, బౌలర్లలో సదర్లాండ్ 15 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నది. అలానా కింగ్, మోలినిక్స్, గార్డ్‌నెర్‌లతో కూడా భారత బ్యాటర్లకు సవాల్ తప్పదు.

Next Story