- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : భారత దేశవాళీ క్రికెట్ సీజన్ 2026-27కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఈ సీజన్ దులీప్ ట్రోఫీతో మొదలుకానుంది. ఈ టోర్నీ బెంగళూరు వేదికగా ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరుగుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 1 నుంచి 5 వరకు శ్రీనగర్ ఇరాన్ కప్‌కు ఆతిథ్యమిస్తుంది. అనంతరం దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ జరుగుతుంది. అక్టోబర్ 11 నుంచి రంజీ ప్రారంభమవుతుంది. రెండు దశల్లో జరిగే ఈ టోర్నీలో ముందుగా ఎలైట్ గ్రూపు మ్యాచ్‌లు అక్టోబర్ 11 నుంచి 5 వరకు జరుగుతాయి. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి మార్చి 3 వరకు రెండో దశ మ్యాచ్‌లు జరుగుతాయి. కల్నల్ సీకే నాయుడు(అండర్-23) టోర్నీ కూడా అక్టోబర్ 12 నుంచి మార్చి 1 వరకు రెండు దశల్లో షెడ్యూల్ చేశారు. సీనియర్ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 14 నుంచి డిసెంబర్ 6 వరకు, సీనియర్ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 14 నుంచి జనవరి 8 వరకు జరగనున్నాయి.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లకు ముంబై, కోల్‌కతా, మొహాలీతోపాటు వైజాగ్ కూడా ఆతిథ్యమివ్వనుంది. అలాగే, వైజాగ్ విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లకు కూడా వేదిక కానుంది. మహిళల క్రికెట్ సీనియర్ మహిళల టీ20 ట్రోఫీతో ప్రారంభంకానుంది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 20 వరకు జరగనుంది. ఆ తర్వాత సీనియర్ మహిళల ఇంటర్ జోనల్ టీ20 ట్రోఫీ, వన్డే ట్రోఫీ, ఇంటర్‌జోనల్ వన్డే ట్రోఫీ, ఇంటర్‌జోనల్ మల్టీ డే ట్రోఫీ జరుగుతాయి.
ఈ సీజన్‌లో బీసీసీఐ కొన్ని మార్పులు చేసింది. పురుషుల అండర్-23 స్టేట్ ‘ఏ’ ట్రోఫీ, మహిళల విజ్జీ ట్రోఫీని వన్డేల నుంచి టీ20లకు మార్చింది. ఆధునిక క్రికెట్‌ను దృష్టి పెట్టుకుని బోర్డు ఈ మార్పు చేసింది. అలాగే, కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ విన్నర్, రెస్ట్ ఆఫ్ ఇండియా మ్యాచ్‌ను పునరుద్ధరించింది. అక్టోబర్ 1 నుంచి 4 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. అలాగే, విజయ్ మర్చంట్ ట్రోపీ(అండర్-16)ను షెడ్యూల్‌లో ముందుకు జరిపింది. నవంబర్ 14 నుంచి జనవరి 5 వరకు ఈ టోర్నీ జరగనుంది. మెరుగైన షెడ్యూల్, ఆటగాళ్ల సన్నద్ధత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు తెలిపింది. ఈ సీజన్‌లో పురుషుల విభాగంలో సీనియర్, అండర్-23, అండర్-19, అండర్-16 కేటగిరీల్లో, మహిళల విభాగంలో సీనియర్, అండర్-23, అండర్-19, అండర్-15 కేటగిరీల్లో బీసీసీఐ టోర్నీలు నిర్వహించనుంది. ఈ సీజన్‌లో మొత్తం 1,788 మ్యాచ్‌లు జరగనున్నాయి.






