పంత్ నాలుగో టెస్టు ఆడతాడా?లేదా?.. భారత అసిస్టెంట్ కోచ్ ఏం చెప్పాడంటే?

by Harish |

మూడో టెస్టులో ఓడటంతో 2-1తో వెనుకబడిన భారత్‌ సిరీస్‌లో ఉండాలంటే నాలుగో టెస్టులో గెలిచి తీరాల్సిందే.

పంత్ నాలుగో టెస్టు ఆడతాడా?లేదా?.. భారత అసిస్టెంట్ కోచ్ ఏం చెప్పాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : మూడో టెస్టులో ఓడటంతో 2-1తో వెనుకబడిన భారత్‌ సిరీస్‌లో ఉండాలంటే నాలుగో టెస్టులో గెలిచి తీరాల్సిందే. అయితే, కీలకమైన మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఆడతాడా?లేదా?అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మూడో టెస్టులో పంత్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ సబ్‌స్టిట్యూట్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. పంత్ ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 74 రన్స్ చేశాడు. కానీ, గాయం తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులో అసౌకర్యంగా కనిపించాడు. ఒంటిచెత్తో షాట్లు ఆడటం కనిపించింది. కేవలం 12 బంతులే ఎదుర్కొని 9 రన్సే చేసి అవుటయ్యాడు. మరోవైపు, మాంచెస్టర్ గురువారం టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ప్రాక్టీస్ సెషన్‌కు పంత్ దూరంగా ఉన్నాడు. దీంతో నాలుగో టెస్టులో అతను అందుబాటులో ఉంటాడా?లేదా? అన్నది సందిగ్ధం నెలకొంది. మూడు టెస్టుల్లో పంత్ 425 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మంచి ఫామ్‌లో ఉన్న పంత్ ఒకవేళ నాలుగో టెస్టుకు దూరమైతే మాత్రం భారత్‌కు భారీ దెబ్బే.

క్లారిటీ ఇవ్వని అసిస్టెంట్ కోచ్

పంత్ గాయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్‌డెష్కాట్ అప్‌డేట్ ఇచ్చాడు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగో టెస్టు నాటికి అతను ఫిట్‌నెస్ సాధిస్తాడని దీమా వ్యక్తం చేస్తూనే వికెట్ కీపింగ్ చేయడంపై అనుమానం వ్యక్తం చేశాడు. ‘మూడో టెస్టులో పంత్ నొప్పితోనే బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత నొప్పి కాస్త తగ్గింది. మాంచెస్టర్ టెస్టుకు ముందు పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెడతాడు. మ్యాచ్ నాటికి అతను కచ్చితంగా ఫిట్‌నెస్ సాధిస్తాడు. కానీ, కీపింగ్‌పై చివర్లోనే నిర్ణయం తీసుకుంటాం. మరోసారి ఇన్నింగ్స్ మధ్యలో కీపర్‌ను మార్చే పరిస్థితి రాకూడదు. ఒకవేళ అతను ఫిట్‌‌గా ఉంటే బ్యాటింగ్, కీపింగ్ రెండూ చేస్తాడు.’అని తెలిపాడు.

అర్ష్‌దీప్‌కు గాయం

బుమ్రాకు విశ్రాంతినిస్తారా?.. పంత్ గాయం నుంచి కోలుకుంటాడా? అన్న అనుమానాలు ఉన్న వేళ టీమిండియాకు మరో షాక్ తగిలింది. యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ గాయపడ్డాడు. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని చేతి వేలికి తీవ్ర గాయమైనట్టు వార్తలు వస్తున్నాయి. బంతి చేతికి బలంగా తాకడంతో రక్తం కూడా వచ్చినట్టు సదరు కథనాలు పేర్కొన్నాయి. అర్ష్‌దీప్ గాయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటివరకు టెస్టుల్లో అరంగేట్రం చేయని అర్ష్‌దీప్ మూడు టెస్టులు బెంచ్‌కే పరిమితమయ్యాడు. మూడో టెస్టులో అతన్ని తీసుకుంటారని వార్తలు వచ్చినా టీమ్ మేనేజ్‌మెంట్ ఆకాశ్ దీప్‌ వైపు మొగ్గుచూపింది. నాలుగో టెస్టులో బుమ్రాకు రెస్ట్ ఇస్తే అర్ష్‌దీప్‌కు తుది జట్టులో చోటు దక్కొచ్చు. కానీ, అర్ష్‌దీప్ గాయపడటం టీమిండియాను కలవరపెడుతుంది.


Next Story