బంగ్లాదేశ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ.. శాఫ్ అండర్-19 టైటిల్ కైవసం

by Harish |

భారత అండర్-19 ఫుట్‌బాల్ జట్టు అదరగొట్టింది.

బంగ్లాదేశ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ.. శాఫ్ అండర్-19 టైటిల్ కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : భారత అండర్-19 ఫుట్‌బాల్ జట్టు అదరగొట్టింది. సౌత్ ఆసియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(శాఫ్) అండర్-19 చాంపియన్‌షిప్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి రికార్డు స్థాయిలో 10వ ఏజ్ గ్రూపు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం అరుణాచల్ ప్రదేశ్‌లోని గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 1-1(4-3) పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించింది. ముందుగా నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్ చేశారు. 2వ నిమిషంలోనే భారత కెప్టెన్ సింగమయుమ్ షమీ గోల్ చేశాడు. దీంతో ఫస్టాఫ్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. చివరి వరకూ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది.

అయితే, 61వ నిమిషంలో బంగ్లాదేశ్ ప్లేయర్ జాయ్ అహ్మద్ గోల్ చేసి భారత్ ఆశలపై నీళ్లు చల్లాడు. స్కోరు 1-1తో సమం అవడంతో మ్యాచ్‌‌ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది. పెనాల్టీ షూటౌట్‌ కూడా ఆసక్తికరంగానే సాగింది. కానీ, చివరికి భారత్ 4-3తో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. దీంతో భారత జట్టు రికార్డు స్థాయిలో 10వ ఏజ్ గ్రూపు టైటిల్ సాధించింది. ఇది రెండో అండర్-19 టైటిల్. ఇంతకుముందు అండర్ 15, 16, 17 టైటిల్స్‌ను రెండేసి గెలవగా.. అండర్-18, 20 టోర్నీల్లో ఓసారి విజయం సాధించింది. ఈ సారి ఒక్క మ్యాచ్‌లోనూ ఓడని భారత్ అజేయంగా టైటిల్ గెలవడం విశేషం. గ్రూపు దశలో శ్రీలంక, నేపాల్‌పై, సెమీస్‌లో మాల్దీవులపై విజయం సాధించింది.


Next Story