ENG vs IND : తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 358 ఆలౌట్‌

by Muthe.Rajitha |

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 114.1 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌట్ అయింది.

ENG vs IND : తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 358 ఆలౌట్‌
X

దిశ, వెబ్ డెస్క్ : మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 114.1 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి రోజు స్టంప్స్ వరకు 264/4తో బలమైన స్థితిలో ఉన్న భారత్, రెండో రోజు ఉదయం సెషన్లో 44 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లను కోల్పోయింది. బీ. సాయి సుదర్శన్ 61 (174 బంతులు, 7 ఫోర్లు), యశస్వి జైశ్వాల్ 58 (107 బంతులు, 10 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ 54 (75 బంతులు) తో రాణించారు.

మొదటి రోజు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా,భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. కేఎల్ రాహుల్ (46), జైశ్వాల్ 94 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంతో బలమైన పునాది వేశారు. రాహుల్‌ను క్రిస్ వోక్స్, జైశ్వాల్‌ను లియామ్ డాసన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (12)ను స్టోక్స్ ఔట్ చేశారు. సాయి సుదర్శన్ కూడా స్టోక్స్ బౌన్సర్‌కు పుల్ షాట్ ఆడబోయి ఔటయ్యాడు.

ఇక 68వ ఓవర్‌లో వోక్స్ యార్కర్‌ను రివర్స్ స్వీప్ ఆడబోయిన రిషబ్ పంత్ కుడి పాదానికి గాయమై మైదానం వీడాల్సి వచ్చింది. రెండో రోజు నొప్పితోనే తిరిగి బ్యాటింగ్‌కు వచ్చి, 54 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రవీంద్ర జడేజా (25), శార్దూల్ ఠాకూర్ (41), వాషింగ్టన్ సుందర్ (27) కొంత నిలదొక్కుకున్నప్పటికీ.. స్టోక్స్ (5/72), జోఫ్రా ఆర్చర్ (3 వికెట్లు) బౌలింగ్‌లో భారత్ చివరి వికెట్లను త్వరగా కోల్పోయింది. ఈ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా, సిరీస్‌ను సమం చేయాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాల్సి ఉంది.

Next Story