Ind vs Pak U19: పాక్‌పై ఘన విజయం.. ప్రపంచకప్ సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్

by Ramesh Naini |

అండర్-19 ప్రపంచకప్‌లో భారత యువజట్టు సత్తా చాటింది. దాయాది పాకిస్తాన్‌తో జరిగిన ప్రతిష్టాత్మక సూపర్ సిక్సెస్ మ్యాచ్‌లో భారత్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Ind vs Pak U19: పాక్‌పై ఘన విజయం.. ప్రపంచకప్ సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అండర్-19 ప్రపంచకప్‌లో భారత యువజట్టు సత్తా చాటింది. దాయాది పాకిస్తాన్‌తో జరిగిన ప్రతిష్టాత్మక సూపర్ సిక్సెస్ మ్యాచ్‌లో భారత్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా సగర్వంగా సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. స్పిన్నర్ల మాయాజాలం, వేదాంత్ త్రివేది బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో భారత్ పాక్‌ను మట్టికరిపించింది.

ఆదుకున్న వేదాంత్..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ధాటిగా ఆడిన వైభవ్ సూర్యవంశీ (30) త్వరగానే పెవిలియన్ చేరగా, కెప్టెన్ ఆయూష్ మాత్రే డకౌట్‌గా వెనుదిరిగాడు. కేవలం 47 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును వేదాంత్ త్రివేది ఆదుకున్నాడు. 98 బంతుల్లో 68 పరుగులు చేసిన వేదాంత్.. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. చివర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలాన్ పటేల్ (21) దూకుడుగా ఆడటంతో భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఇక, 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా స్పిన్నర్లు పాక్ బ్యాటర్లను క్రీజులో నిలవనీయలేదు. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్ (66), హంజా జహూర్ (42) మినహా ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోయిన పాక్.. 46.2 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో ఖిలాన్ పటేల్, ఆయూష్ మాత్రే తలో 3 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు. మిగతా బౌలర్లు తలో వికెట్ తీసి పాక్ పతనాన్ని శాసించారు.

సెమీస్‌లో అఫ్గాన్‌తో పోరు

ఈ విజయంతో గ్రూప్ దశలో ఇంగ్లాండ్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన భారత్.. సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది.

ఫిబ్రవరి 3 (తొలి సెమీస్): ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్

ఫిబ్రవరి 4 (రెండో సెమీస్): భారత్ vs అఫ్గానిస్తాన్

Next Story