వైడ్‌తో ఓడారు.. భారత్-ఎకు షాకిచ్చిన బంగ్లాదేశ్!

by Phanindra |

భారత్-ఎకు బంగ్లాదేశ్-ఎ టీం షాకిచ్చింది. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీస్‌లో భారత్-ఎ ఓడింది.

వైడ్‌తో ఓడారు.. భారత్-ఎకు షాకిచ్చిన బంగ్లాదేశ్!
X

దిశ, స్పోర్ట్స్: దోహా వేదికగా జరుగుతున్న ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో టీమిండియా కథ ముగిసింది. సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్-ఎ చేతిలో ఓటమిపాలైన భారత జట్టు ఇంటిముఖం పట్టింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన తొలి సెమీఫైనల్‌లో చివరకు బంగ్లాదేశ్‌ను విజయం వరించింది. ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఓపెనర్ హబీబుర్ రెహ్మాన్ సోహన్ (65), జీషన్ ఆలమ్ (26) అదిరే ఆరంభం ఇచ్చారు. చివర్లో ఎస్ఎం మెహరూబ్ (48 నాటౌట్) మెరుపులు తోడవడంతో ఆ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్‌లో భారత్‌కు కూడా మంచి ఆరంభమే దక్కింది. వైభవ్ సూర్యవంశీ (38), ప్రియాన్ష్ ఆర్య (44) ధనాధన్ ఇన్నింగ్సులు ఆడారు. నమన్ ధీర్ (7) విఫలమైనా.. కెప్టెన్ జితేశ్ శర్మ (33), నేహాల్ వధీర (32 నాటౌట్) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వీరిద్దరూ ఆశించినంత వేగంగా ఆడలేకపోయారు. చివర్లో రమణ్‌దీప్ సింగ్ (17), ఆశుతోష్ శర్మ (13) భారీ షాట్లు ఆడటంతో భారత్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేయగలిగింది.

పరుగులే చేయకుండా..

రెండు జట్ల స్కోర్లు సమం అవడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. టీమిండియా మంచి ఫామ్‌లో ఉన్న సూర్యవంశీ, ప్రియాన్ష్‌ను పంపుతుందని అంతా అనుకున్నారు. కానీ కెప్టెన్ జితేశ్, రమణ్‌దీప్ సింగ్ క్రీజులోచి వచ్చారు. జితేశ్ తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ అవగా.. రెండో బంతికే ఆశుతోష్ శర్మ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఒక్క పరుగు చేయకుండానే సూపర్ ఓవర్‌ను భారత జట్టు ముగించింది. బంగ్లా కూడా తొలి బంతికే యాసిర్ అలీ వికెట్ కోల్పోయింది. అయితే రెండో బంతికి సూయష్ శర్మ వైడ్ వేయడంతో భారత్ ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది.

Next Story