టీ20ల్లో భారత్ జైత్రయాత్ర కొనసాగేనా?.. నేడే సౌతాఫ్రికాతో తొలి టీ20

by Harish |

టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 జరగనుంది.

టీ20ల్లో భారత్ జైత్రయాత్ర కొనసాగేనా?.. నేడే సౌతాఫ్రికాతో తొలి టీ20
X

దిశ, స్పోర్ట్స్ : కొంతకాలంగా టీ20ల్లో టీమిండియాకు తిరుగులేదు. విదేశాల్లోనైనా, సొంతగడ్డపైనైనా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు ఆ తర్వాత కూడా చాంపియన్‌లాగే ఆడుతోంది. సెప్టెంబర్‌లో టీ20 ఫార్మాట్‌లోనే జరిగిన ఆసియా కప్ గెలువగా ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి టీ20 సిరీస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు సొంతగడ్డపై సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ఇరు జట్లు టెస్టు, వన్డే సిరీస్‌ల్లో పాల్గొన్నాయి. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ నెగ్గగా.. భారత జట్టు వన్డే సిరీస్ కైవసం చేసుకుని దెబ్బకు దెబ్బకు తీసింది. ఇప్పుడు టీ20 సిరీస్‌లో తమ జైత్రయాత్రను కొనసాగించాలని సూర్య సేన భావిస్తుంది. నేడు కటక్ వేదికగా తొలి టీ20 జరగనుంది.

సూర్య, గిల్‌ ఫామ్ అందుకుంటారా?

టీ20 కెప్టెన్‌గా సూర్య విజయవంతమైనా బ్యాటర్‌గా మాత్రం మునుపటిలో రాణించలేకపోతున్నాడు. కొంతకాలంగా ఫామ్‌ లేమితో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది 17 మ్యాచ్‌ల్లో కేవలం 184 రన్స్ మాత్రమే చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూరులో దారుణంగా తేలిపోయిన అతను నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 84 పరుగులే చేశాడు. ఇక, వైస్ కెప్టెన్ గిల్ కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. గతేడాది టీ20ల్లోకి పునరాగమనం చేసినప్పటి నుంచి తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. 12 మ్యాచ్‌ల్లో 259 రన్స్ చేశాడు. టీ20 వరల్డ్ కప్‌ ఇంకా ఎంతో దూరంలో లేదు. కాబట్టి, గిల్, సూర్య ఫామ్ అందుకోవడంలో చాలా కీలకం. సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్‌ను వీరిద్దరూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

పాండ్యాపైనే అందరి దృష్టి

చాలా రోజుల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాపైనే అందరి దృష్టి నెలకొంది. ఆసియా కప్‌లో గాయపడిన అతను ఇటీవలే ఫిట్‌నెస్ సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరపున ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడి ఫామ్ నిరూపించుకున్నాడు. మరోసారి జాతీయ జట్టులో తనదైన ముద్ర వేయాలని చూస్తున్నాడు. బారాబతి స్టేడియంలో ఆదివారం పాండ్యా చాలా సేపు చెమటోడ్చాడు. స్ట్రెచింగ్, రన్నింగ్ డ్రిల్స్ చేశాడు. అనంతరం త్రోడౌన్ స్పెషలిస్ట్‌లతో ప్రాక్టీస్ చేశాడు. 20 నిమిషాలపాటు బౌలింగ్ కూడా చేశాడు.

టీ20ల్లో సఫారీలు డల్

టీ20ల్లో సౌతాఫ్రికా ప్రదర్శన ఈ ఏడాది గొప్పగా ఏం లేదు. ఆగస్టులో ఆస్ట్రేలియా చేతిలో 2-1తో సిరీస్ కోల్పోయింది. ఇంగ్లాండ్‌తో సిరీస్ 1-1తో సమంగా ముగించింది. భారత్‌తో సిరీస్‌కు ముందు పాక్ పర్యటనకు వెళ్లగా అక్కడ కూడా సిరీస్‌ను సమర్పించుకుంది. వరుస సిరీస్‌ల్లో తడబాటు సౌతాఫ్రికా ప్లేయర్ల ఆత్మవిశ్వాసం దెబ్బేతీసేదే. కానీ, టెస్టు, వన్డే సిరీస్‌ల్లో ఆ జట్టు ప్రదర్శన చూసిన తర్వాత తక్కువ అంచనా వేయడానికి లేదు. మార్‌క్రమ్, డికాక్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి ప్రమాదకరమైన హిట్టర్లు ఆ జట్టులో ఉన్నారు. ఆల్‌రౌండర్ జాన్సెన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై సీనియర్ బౌలర్లు నోర్జే, లుంగి ఎంగిడి కూడా ప్రభావం చూపొచ్చు. ఇక స్పిన్నర్ మహరాజ్ మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

బ్యాటింగ్‌కు స్వర్గధామం

కటక్‌లోని బారాబతి స్టేడియంలో తొలి టీ20కి ఎర్రమట్టి పిచ్‌ను ఉపయోగించనున్నారు. ఈ పిచ్ అదనపు పేస్, బౌన్స్‌ ఇస్తుంది. ఇది బ్యాటర్లకు స్వర్గధామాన్ని అందిస్తుంది. చిన్న బౌండరీలు ఉండటం వల్ల భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. సాయంత్రం మంచు పడటం వల్ల చేజింగ్ సులభతరం కానుంది. కాబట్టి, టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోవచ్చు. బారాబతి గ్రౌండ్‌లో టీమిండియాకు గొప్ప రికార్డు లేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడింది. ఆ రెండు కూడా సౌతాఫ్రికా చేతుల్లోనే ఓడటం గమనార్హం.

తుది జట్లు(అంచనా)

భారత్ : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె/వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రిత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్

సౌతాఫ్రికా : మార్‌క్రమ్, డికాక్, హెండ్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్, కార్బిన్ బోష్, జాన్సెన్, నోర్జే, లుంగి ఎంగిడి, కేశవ్ మహరాజ్

Next Story