- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND vs ENG : తొలి టెస్టు ఇంగ్లాండ్‌దే.. భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత్ విఫలం
ఆసక్తికరంగా సాగిన తొలి టెస్టు చివరికి ఇంగ్లాండ్ కైవసమైంది

దిశ, స్పోర్ట్స్ : 371 లక్ష్యం.. టార్గెట్ పెద్దదే. కానీ, భారత బౌలర్లు ఇంగ్లాండ్‌ను నిలువరించలేకపోయారు. డక్కెట్ భారీ శతకంతో కదంతొక్కి మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పాడు. అయితే, ఒక దశలో శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ స్వల్ప వ్యవధిలో వికెట్లు తీసి ఆశలు రేపినా.. ఆ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోలేకపోయింది. ఫలితంగా తొలి టెస్టులో ఓటమి తప్పలేదు. 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ అలవోకగా ఛేదించేసింది. ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా ఓటమితో మొదలుపెట్టింది.
ఆసక్తికరంగా సాగిన తొలి టెస్టు చివరికి ఇంగ్లాండ్ కైవసమైంది. లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చివరిరోజైన మంగళవారం ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471 రన్స్ చేయగా.. ఇంగ్లాండ్ 465 పరుగులు చేసింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 364 రన్స్ చేసి ఇంగ్లాండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 82 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డక్కెట్(149) భారీ శతకంతో రెచ్చిపోయి ఇంగ్లాండ్ గెలుపు తేలికచేశాడు. అతనికితోడు జాక్ క్రాలీ(65), జోరూట్(53 నాటౌట్), జేమీ స్మిత్(44 నాటౌట్) సత్తాచాటారు. డక్కెట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. జూలై 2 నుంచి రెండో టెస్టు ప్రారంభంకానుంది.
డక్కెట్ షో
ఇంగ్లాండ్ విజయంలో పూర్తి క్రెడిట్ డక్కెట్‌దే. ఓవర్‌నైట్ స్కోరు 21/0తో చివరి రోజు ఆట కొనసాగించిన ఇంగ్లాండ్ మంగళవారం ఎలాంటి తడబాటుకు గురికాకుండా లక్ష్యాన్ని ఛేదించిందంటే అతనే కారణం. ఓపెనర్‌గా వచ్చిన అతను 170 బంతుల్లో 149 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు ఉన్నాయి. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి జట్టును లక్ష్యంగా దిశగా నడిపించాడు. మరో ఓపెనర్ జాక్ క్రాలీహాఫ్ సెంచరీతో మెరిశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 188 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ క్రీజులో పాతుకపోవడంతో భారత జట్టులో నైరాశ్యం అలుముకుంది. వారిని అవుట్ చేసేందుకు బౌలర్ల ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి జాక్ క్రాలీని ప్రసిద్ధ్ అవుట్ చేసి భారత్‌కు ఊరటనిచ్చాడు. కాసేపటికే ప్రసిద్ధ్.. ఓలీ పోప్(8)ను కూడా అవుట్ చేశాడు. ఆ కాసేపటికే శార్దూల్ ఠాకూర్ మాయ చేశాడు. దూకుడు మీద ఉన్న డక్కెట్‌కు చెక్ పెట్టాడు. అదే ఓవర్‌లో మరో ప్రమాదకరమైన బ్యాటర్ హ్యారీ బ్రూక్(0)ను పెవిలియన్ పంపాడు. దీంతో భారత్ పుంజుకునేలా కనిపించింది. కానీ, దక్కిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయింది. జోరూట్, బెన్ స్టోక్స్(33) మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. స్టోక్స్ అవుటైన తర్వాత రూట్, జేమీ స్మిత్ కలిసి ఇంగ్లాండ్ విజయాన్ని లాంఛనం చేశారు.






