- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ జోరు కొనసాగనీ.. నేటి నుంచే ఇంగ్లాండ్ మూడో టెస్టు
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుంది.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా పరాజయంతో మొదలుపెట్టింది. తొలి టెస్టులో దాదాపు నాలుగు రోజులు పైచేయి సాధించినా ఐదో రోజు ఇంగ్లాండ్‌ను నిలువరించలేక మ్యాచ్‌ను కోల్పోయింది. ఆ ఓటమి నుంచి లోపాలను సరిదిద్దుకున్న గిల్ సేన బలంగా పుంజుకుంది. రెండో టెస్టులో అదరగొట్టింది. ఇంగ్లాండ్‌ను 336 పరుగుల భారీ తేడాతో ఓడించడమే కాకుండా ఎడ్జ్‌బస్టన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. రెండో టెస్టు విజయంతో టీమిండియా జోరు మీద ఉన్నది. ఇదే జోరును మూడో టెస్టులోనూ కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. నేటి నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియం వేదిక. భారత కాలమానం ప్రకారం గురువారం 3:30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది.
బ్యాటింగ్‌లో తిరుగులేదు
ఇంగ్లాండ్ పిచ్‌లపై సాధారణంగా భారత బ్యాటర్లు తడబడుతుంటారు. కానీ, ఈ పర్యటనలో టీమిండియా బ్యాటర్లు అదరగొడుతున్నారు. తొలి రెండు టెస్టుల్లో ఏ విధంగా పరుగుల వరద పారించారో చూశాం. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 835 పరుగులు చేసింది. అయితే, పలు తప్పిదాలతో ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమపాలైంది. ఇక, రెండో టెస్టులో భారత్ 1014 రన్స్ చేసి టెస్టుల్లో అత్యధిక స్కోరును నమోదు చేసింది. కాబట్టి, బ్యాటింగ్ పరంగా గిల్ సేనకు ఢోకా లేదు. కెప్టెన్ గిల్, యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లు భీకర ఫామ్‌లో ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరూ రెచ్చిపోయిన స్కోరు 400 దాటడం ఖాయమే. అయితే, లార్డ్స్ పిచ్ కాస్త భిన్నమని విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తిగా పేసర్లకు అనుకూలంగా ఉండేలా పిచ్‌ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి, అక్కడ బ్యాటింగ్‌కు సవాల్‌గా ఉండొచ్చు. అయితే, పిచ్‌కు తగ్గట్టు ఆడుతూ కాస్త సహనంగా ఉండి క్రీజులో పాతుకపోతే బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించొచ్చు. టాపార్డర్‌కు జడేజా, సుందర్, నితీశ్, కరుణ్ నాయర్ సహకారం కూడా తోడైతే టీమిండియాకు ఢోకా ఉండదు.
బుమ్రా వస్తున్నాడు
తొలి టెస్టులో ఆశించినంత రాణించని బౌలింగ్ దళం రెండో టెస్టులో మాత్రం ఇంగ్లాండ్‌ను బెంబేలెత్తించింది. రెండో టెస్టులో బుమ్రాకు రెస్ట్ ఇవ్వగా.. ఆకాశ్ దీప్, సిరాజ్ బౌలింగ్ యూనిట్‌ను తమ భుజాలపై మోశారు. ఆకాశ్ 10 వికెట్లు తీయగా.. సిరాజ్ 7 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరూ విజృంభించడంతో బుమ్రా లేని లోటు ఎక్కడా కనిపించలేదు. మూడో టెస్టుకు బుమ్రా అందుబాటులోకి రానున్నాడు. బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్ త్రయాన్ని ఎదుర్కోవడం ఇంగ్లాండ్ బ్యాటర్లకు పెను సవాలే. రెండో టెస్టులో ఓటమితో ఇంగ్లాండ్ హెడ్ కోచ్ మెక్‌ల్లమ్ లార్డ్స్ పిచ్‌ను పేస్‌కు అనుకూలంగా సిద్ధం చేయాలని క్యూరేటర్‌ను కోరాడట. ఇది టీమిండియాకు కూడా లాభమే. బుమ్రా, ఆకాశ్, సిరాజ్ చెలరేగితే ఇంగ్లాండ్ కష్టాల్లో పడకతప్పదు.
ప్రసిద్ధ్‌పై వేటు.. అర్ష్‌దీప్ ఎంట్రీ?
లార్డ్స్ పిచ్ పేస్‌కు అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో భారత్ తుది జట్టులో ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, నలుగురు పూర్తి స్థాయి పేసర్లు, ఒక స్పిన్ ఆల్‌రౌండర్‌కు చాన్స్ దక్కే అవకాశం ఉంది. ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లను తీసుకుంటే కరుణ్ నాయర్‌కు మరోసారి చాన్స్ దక్కనుంది. అలాగే, సాయి సుదర్శన్ లేదా అభిమన్యు ఈశ్వరన్‌లలో ఒకరు తుది జట్టులోకి రావొచ్చు. రెండు టెస్టుల్లో నిరాశపర్చిన ప్రసిద్ధ్ కృష్ణపై వేటు పడేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అదే జరిగితే మరో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. బుమ్రా, ఆకాశ్, సిరాజ్, అర్ష్‌దీప్‌లతో పేస్ దళంగా ఖాయంగా కనిపిస్తుంగా పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. నితీశ్‌ను తీసుకోవాలనుకుంటే సాయి సుదర్శన్ లేదా అభిమన్యు ఈశ్వరన్‌లు బెంచ్‌కే పరిమితమవుతారు.
- Tags
- IND VS ENG






