IND VS ENG : ఆసక్తికరంగా మారిన తొలి టెస్టు.. టీమిండియాకు దీటుగా బదులిస్తోన్న ఇంగ్లాండ్

by Harish |

భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు శనివారం ఆసక్తికరంగా మారింది.

IND VS ENG : ఆసక్తికరంగా మారిన తొలి టెస్టు.. టీమిండియాకు దీటుగా బదులిస్తోన్న ఇంగ్లాండ్
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు శనివారం ఆసక్తికరంగా మారింది. లీడ్స్‌లోని హెడింగ్లీలో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజు టీమిండియా స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించగా రెండో రోజు ఇంగ్లాండ్ పుంజుకుంది. ముందుగా భారత్ తొలి ఇన్నింగ్స్‌‌లో 471 రన్స్ చేసి ఆలౌటైంది. రిషబ్ పంత్(134) సూపర్ సెంచరీతో రాణించడంతో భారీ స్కోరు దక్కింది. ఓవర్‌‌నైట్ స్కోరు 359/3తో శనివారం ఆట కొనసాగించిన భారత్ 112 పరుగులు జోడించి 7 వికెట్లు కోల్పోయింది. స్టోక్స్(4/66), జోష్ టంగ్(4/86) సత్తాచాటి టీమిండియా‌ను 500లోపే కట్టడి చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లాండ్.. టీమిండియాకు దీటుగా బదులిస్తోంది. ఓలీ పోప్(100 బ్యాటింగ్) అజేయ శతకంతో కదం తొక్కాడు. అతనికితోడు బెన్ డక్కెట్(62) కూడా రాణించాడు. దీంతో శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 209 రన్స్ చేసింది. ప్రత్యర్థిని బుమ్రా(3/48) కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. ఇంగ్లాండ్ ఇంకా 262 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు బౌలర్లు ఇంగ్లాండ్‌ను త్వరగా ఆలౌట్ చేస్తే టీమిండియాకు మ్యాచ్‌పై పట్టు చిక్కతుంది.

చెలరేగిన పంత్

గతేడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన తర్వాత రిషబ్ పంత్‌పై విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు ఒక ఒక్క ఇన్నింగ్స్‌త్ సమాధానమిచ్చాడు. కెప్టెన్ గిల్, యశస్వి జైశ్వాల్ సెంచరీలతో భారత్‌కు బలమైన పునాది వేయగా పంత్ కూడా శతక్కొట్టి జట్టుకు భారీ స్కోరు అందించాడు. శనివారం ఓవర్‌నైట్ స్కోరు 359/3తో భారత్ ఆట కొనసాగించింది. తొలి రోజే గిల్ సెంచరీ నమోదు చేయగా.. పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక, రెండో రోజు పంత్ తన జోరు కొనసాగించాడు. గిల్ స్ట్రైక్ రేటేట్ చేస్తుంటే పంత్ తనదైన స్టైల్‌లో రెచ్చిపోయాడు. 178 బంతుల్లో 134 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. పంత్ చెలరేగడంతో భారత్ 500 స్కోరు దిశగా వెళ్లింది. అంతా బాగుంది అనుకునే లోపే టీమిండియా ఆట ఒక్కసారిగా మలుపు తిరిగింది. స్టోక్స్, జోష్ టంగ్ వరుసగా వికెట్లు తీశారు. 150 పరుగుల మార్క్ దిశగా వెళ్తున్న గిల్(147)ను షోయబ్ బషీర్ అవుట్ చేయడంతో వికెట్ల పతనం మొదలైంది. గిల్, పంత్ కలిసి 209 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. మిగతా బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. కేవలం 41 పరుగుల వ్యవధిలోనే భారత్ 7 వికెట్లు కోల్పోవడం గమనార్హం. దాదాపు 8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్(0) విఫలమమవ్వగా.. శార్దూల్(1), బుమ్రా(0), జడేజా(11, ప్రిసిద్ధ్(1) పెవిలియన్‌కు క్యూకట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్, బెన్ స్టోక్స్ చెరో 4 వికెట్లతో సత్తాచాటారు.

పోప్ సెంచరీ.. దీటుగా బదులిస్తున్న ఇంగ్లాండ్

తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు ఇంగ్లాండ్ దీటుగా బదులిస్తోంది. బుమ్రా తొలి ఓవర్‌లోనే జాక్ క్రాలీ(4)ను అవుట్ చేయడంతో మొదట ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. కానీ, క్రీజులోకి వచ్చిన ఓలీ పోప్ అజేయ శతకంతో రెచ్చిపోయాడు. వన్డే తరహాలో ఆడుతూ బౌండరీలతో చెలరేగాడు. అతనికితోడు బెన్ డక్కెట్ కూడా సత్తాచాటాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లాండ్ గాడిలో పడింది. డక్కెట్‌ను బుమ్రా అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. అనంతరం జో రూట్‌(28)తో కలిసి ఓలీ పోప్ స్కోరును 200 దాటించాడు. అయితే, బుమ్రా ఇంగ్లాండ్‌ను ఇబ్బందిపెట్టాడు. జాక్ క్రాలీ, డక్కెట్, జోరూట్ వంటి ప్రమాదకరమైన బ్యాటర్ల వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.

Next Story