IND VS ENG : టీ20 సిరీస్‌పై భారత్ కన్ను.. నేడు మూడో టీ20

by Harish |

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌పై భారత జట్టు కన్నేసింది.

IND VS ENG : టీ20 సిరీస్‌పై భారత్ కన్ను.. నేడు మూడో టీ20
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియా జోరు ప్రదర్శిస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో విజయఢంకా మోగించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లిన టీమిండియా సిరీస్ విజయంపై కన్నేసింది. మరో మ్యాచ్‌లో నెగ్గితే సిరీస్ సూర్యసేన వశమవుతుంది. నేడు రాజ్‌కోట్ వేదికగా మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి మరో రెండు టీ20లు మిగిలి ఉండగానే సిరీస్‌ను ఖాతాలో వేసుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతున్నది. బౌలింగ్ పరంగా జట్టుకు ఢోకా లేదు. రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బందిపెట్టారు. బ్యాటింగ్‌లోనూ భారత్ పటిష్టంగానే ఉన్నది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఫామ్‌లో ఉండటం బలం. అయితే, శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ గత రెండు మ్యాచ్‌ల్లో నిరాశరిచారు. వీరు పుంజుకుంటే జట్టుకు తిరుగుండదు. రెండో టీ20లో నిరాశపర్చిన ధ్రువ్ జురెల్, హార్దిక్ పాండ్యా కూడా రాణించాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు, వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడటంతో ఇంగ్లాండ్ సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది. దీంతో ఎలాగైనా మూడో టీ20లో గెలిచి సిరీస్ ఆశలు కాపాడుకోవాలుకుంటున్నది. జట్టులో కెప్టెన్ బట్లర్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. మినహా మిగతా వారు విఫలమవుతుండటం ఆ జట్టుకు సమస్యగా మారింది. బ్యాటింగ్‌లో లోపాలను సరిదిద్దుకోకుంటే ఇంగ్లాండ్ మరో ఓటమి తప్పదు.

షమీ ఆడతాడా?

స్టార్ బౌలర్ మహ్మద్ షమీ రీఎంట్రీ గురించి అభిమానులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. దాదాపు 14 నెలల తర్వాత పేసర్ మహ్మద్ షమీ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లో అతన్ని పక్కనపెట్టారు. మూడో టీ20కైనా అతనికి తుది జట్టులో చోటు దక్కుతుందో?లేదో చూడాలి. అతని ఫిట్‌‌గా లేడని అందుకే తుది జట్టులోకి తీసుకోవడం లేదన్న వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తలపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ క్లారిటీ ఇచ్చాడు. షమీకి ఎలాంటి గాయం కాలేదని, అతను ఫిట్‌గానే ఉన్నాడని తెలిపాడు. మూడో టీ20 మ్యాచ్‌కు సెలెక్షన్‌కు అతను అందుబాటులో ఉంటాడని చెప్పాడు. అయితే, ప్లేయింగ్ 11లో షమీకి చోటు దక్కుతుందా? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్, చాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో షమీపై పనిభారం పడకుండా ఉండేందుకు అతన్ని టీ20లు ఆడించడం లేదని కూడా వార్తలు వస్తున్నాయి. మళ్లీ గాయం బారిన పడితే ఐసీసీ టోర్నీకి దూరమయ్యే ప్రమాదం ఉండటంతో అతని విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ మూడో టీ20లో అతన్ని ఆడించాల్సి వస్తే..స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ తుది జట్టులో స్థానం కోల్పోవచ్చు.

పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ

రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనున్నట్టు నివేదికలు అంచనా వేశాయి. ఈ స్టేడియంలో భారీ స్కోర్ నమోదు కావొచ్చు. బ్యాటర్లను కట్టడి చేయడం బౌలర్లకు సవాలే అని చెప్పొచ్చు. ఈ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ప్రయోజనం పొందనున్నట్టు గత మ్యాచ్‌లను పరిశీలిస్తే తెలుస్తోంది. కాబట్టి, టాస్ కీలకం కానుంది. రాజ్‌కోట్‌లో ఐదు మ్యాచ్‌లు జరగగా.. మూడింట ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ఈ స్టేడియంలో భారత్‌కు మంచి రికార్డే ఉంది.

Next Story