- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND VS ENG : పట్టు బిగించిన భారత్.. ఇంగ్లాండ్ ముందు 374 లక్ష్యం
ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది.

దిశ, స్పోర్ట్స్ : ఐదో టెస్టులో వరుసగా రెండో రోజు టీమిండియాదే ఆధిపత్యం. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం నిర్దేశించి విజయావకాశాలను మెరుగుపర్చుకుంది. ఛేదనలో అప్పుడే తొలి వికెట్ తీసిన గిల్ సేన్ ఇంకా 9 వికెట్లు తీయాలి. ముందుగా ఓవర్‌నైట్ స్కోరు 75/2తో శనివారం ఆట కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్(118) సెంచరీతో కదం తొక్కాడు. ఆకాశ్ దీప్(66), జడేజా(53), వాషింగ్టన్ సుందర్(53) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల కష్టతరమైన టార్గెట్‌ను పెట్టింది. మూడో రోజే సిరాజ్ ఇంగ్లాండ్ పతనాన్ని మొదలుపెట్టాడు. ఓపెనర్ జాక్ క్రాలీ(14)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. డక్కెట్(34 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 50 స్కోరు చేసింది. ఇంకా ఆ జట్టు విజయానికి 324 రన్స్ కావాలి. మ్యాచ్‌లో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. అయితే, ఆదివారమే ఫలితం తేలే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయావకాశాలు భారత్‌కే ఎక్కువగా ఉన్నప్పటికీ ముప్పు అలాగే ఉంది. బౌలర్లు రాణిస్తేనే గెలుపు లాంఛనమవుతుంది.
అండగా నిలిచిన జైశ్వాల్
రాహుల్(7), సుదర్శన్(11) నిరాశపర్చడంతో రెండో ఇన్నింగ్స్ భారత్‌కు అంత సులభంగా ఉండదని అభిమానులు భావించారు. కానీ, ఓపెనర్ యశస్వి జైశ్వాల్ జట్టుకు అండగా నిలిచాడు. శుక్రవారమే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతను శనివారం కూడా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అతన్ని అవుట్ చేసేందుకు ఇంగ్లాండ్ రచించిన వ్యూహాలు తిప్పికొట్టాడు. సింగిల్స్ తీస్తూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. ఆకాశ్ దీప్‌తో కలిసి మూడో వికెట్‌కు 107 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ట్రాక్‌లో పెట్టాడు. ఆ తర్వాత గిల్(11), కరుణ్ నాయర్(17) నిరాశపర్చినప్పటికీ జైశ్వాల్ భారత్‌ను కష్టాల్లోకి వెళ్లకుండా చూశాడు. జడేజాతో కలిసి 44 పరుగుల విలువైన పార్ట్‌నర్‌షిప్ జత చేశాడు. ఈ క్రమంలోనే ఈ సిరీస్‌లో రెండో శతకాన్ని పూర్తి చేశాడు. 164 బంతుల్లో 118 రన్స్ చేశాడు.
ఆకాశ్, జడేజా, సుందర్ కూడా..
ఒక ఎండ్‌లో జైశ్వాల్ జట్టుకు అండగా నిలిస్తే.. మరో ఎండ్‌లో ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కూడా సంచలన ప్రదర్శన చేశారు. ఎవరూ ఊహించని విధంగా 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆకాశ్ దీప్ తనలోని బ్యాటర్‌ను చూపించాడు. ఇంగ్లాంబ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని క్రీజులో పాతుకపోయాడు. జైశ్వాల్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన అతను 94 బంతుల్లో 66 రన్స్ చేశాడు. ఆకాశ్ దీప్ అవుటైన స్వల్ప వ్యవధిలోనే గిల్, కరుణ్ నాయర్ కూడా పెవిలియన్ చేరడంతో భారత్ తడబడింది. అప్పుడు రవీంద్ర జడేజా మరోసారి జట్టును ఆదుకున్నాడు. జైశ్వాల్, ధ్రువ్ జురెల్‌లతో కలిసి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. అయితే, జోష్ టంగ్ బౌలింగ్‌లో అతను అవుటయ్యాడు. ఇక, చివర్లో వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించాడు. గత మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన సుందర్ ఈ మ్యాచ్‌లోనూ సత్తాచాటాడు. నాలుగేసి ఫోర్లు, సిక్సర్లు కొట్టిన అతను 46 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. జోష్ టంగ్ బౌలింగ్‌లోనే సుందర్ అవుటవడంతో భారత్ ఆట ముగిసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లతో రాణించగా.. అట్కిన్సన్ 3, ఓవర్టన్ 2 వికెట్లు తీశారు.
374.. ఇంగ్లాండ్‌కు కష్టమే
374 పరుగుల లక్ష్యం ఛేదించడం ఇంగ్లాండ్‌కు అంత సులభం కాదు. ఇప్పటివరకు ఓవల్ స్టేడియంలో హయ్యెస్ట్ చేజింగ్ చేసిన స్కోరు 263. చేజింగ్ చేసిన జట్టు ఇంగ్లాండే(1902లో ఆస్ట్రేలియాపై. గతేడాది ఇంగ్లాండ్ పెట్టిన 219 పరుగుల టార్గెట్‌ను శ్రీలంక ఛేదించింది. అలాగే, ఈ స్టేడియంలో ఇంగ్లాండ్ నాలుగో ఇన్నింగ్స్‌లో చేసిన అత్యధిక స్కోరు 369. అది కూడా భారత్‌పై. 2007లో ఆ మ్యాచ్ డ్రా అయ్యింది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో ఛేదన ఇంగ్లాండ్ కష్టతరం కానుంది.






