- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
U19 Asia Cup Final : గెలవాల్సిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన యువ భారత్.. టైటిల్ బంగ్లాదేశ్‌దే
అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను బంగ్లాదేశ్ నిలబెట్టుకుంది.

దిశ, స్పోర్ట్స్ : అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను బంగ్లాదేశ్ నిలబెట్టుకుంది. వరుసగా రెండోసారి కప్పును ఎగరేసుకపోయింది. టోర్నీలో జైత్రయాత్ర కొనసాగించిన యువ భారత్ టైటిల్ పోరులో బోల్తా పడింది. చేజేతులా టైటిల్‌ను కోల్పోయింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌లో భారత్ 59 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో బంగ్లా అండర్-19 జట్టు 49.1 ఓవర్లలో 198 రన్స్‌కే కుప్పకూలింది. రిజ్వాన్ హుస్సాన్(47), షిహాబ్ జేమ్స్(40), ఫరిద్ హసన్ ఫైసల్(39) రాణించారు. భారత బౌలర్లలో యుదాజిత్ గుహ, చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ రెండేసి వికెట్లు తీసి బంగ్లాను నిలువరించారు.
200 లోపే ప్రత్యర్థిని కట్టడి చేయడంతో భారత్ విజయం సులభమే అనుకున్నారంతా. కానీ, ఛేదనలో టీమిండియా పేలవ ప్రదర్శన చేసింది. బ్యాటుతో తడబడి అలవోకగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది. 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ అమాన్(26) టాప్ స్కోరరంటే భారత్ బ్యాటింగ్ ఎంత పేలవంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. బంగ్లా బౌలర్లలో కెప్టెన్ హకీమ్ తమీమ్, ఇక్బాల్ హుస్సేన్ మూడేసి వికెట్లతో సత్తాచాటారు. భారత్ ఫైనల్‌లో ఓడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇంతకుముందు టైటిల్ పోరుకు చేరుకున్న ప్రతి సారి విజేతగా నిలిచింది. టోర్నీ చరిత్రలో 8సార్లు చాంపియన్‌గా నిలిచి రికార్డు స్థాయిలో టైటిల్ గెలిచిన రికార్డు భారత్ పేరిటే ఉంది.






