IND VS AFG : శతక్కొట్టిన రాహుల్, గిల్.. తొలి రోజు భారత్‌దే

by Harish |

IND VS AFG : శతక్కొట్టిన రాహుల్, గిల్.. తొలి రోజు భారత్‌దే
X

దిశ, స్పోర్ట్స్ : అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టులో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ముల్లాన్‌పూర్‌లో శనివారం ప్రారంభమైన టెస్టును ఘనంగా ఆరంభించింది. తొలి రోజు పూర్తిగా టీమిండియాదే. ఆరు నెలల తర్వాత ఒక టెస్టు మ్యాచ్ ఆడుతుండటంతో భారత ప్లేయర్లు ఏ విధంగా రాణిస్తారో అన్న అనుమానాలు ఉండే. అలాగే మొన్నటివరకు టీ20 ఫార్మాట్‌ ఆడిన వారు టెస్టు ఫార్మాట్‌కు తమ ఆటను మార్చుకుంటారా? అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ, టీమిండియా ఆటగాళ్లు ఏమాత్రం నిరాశపర్చలేదు. అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 368 పరుగులు చేసింది. భారత్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు భారత్ చేసిన 4వ అత్యధిక స్కోరు ఇది. కేఎల్ రాహుల్(100), కెప్టెన్ శుభ్‌మన్ గిల్(103 నాటౌట్) శతకాలతో కదం తొక్కారు. సాయి సుదర్శన్(81), రిషబ్ పంత్(50 నాటౌట్) కూడా రాణించారు. దీంతో మొదటి రోజు బలమైన పునాది పడటంతో ఇండియా భారీ స్కోరుపై కన్నేసింది.

ముందుగా రాహుల్, సుదర్శన్

ఓపెనర్ యశస్వి జైశ్వాల్(24) త్వరగానే అవుటవడంతో భారత్ 41 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. టీమిండియాకు అదొక్క నిరాశ తప్ప తొలి రోజు అంతా ఏకపక్షమే. ఇటీవల ఐపీఎల్‌లో సత్తాచాటిన కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ టెస్టు మ్యాచ్‌లోనూ తమ ఫామ్ కొనసాగించారు. మొన్నటివరకూ టీ20 ఫార్మాట్‌ ఆడిన వారు తమ ఆటను టెస్టులకు తగినట్టు మార్చుకుని ఆడారు. భారత్ ఇన్నింగ్స్‌కు మొదట పునాది వేసింది వీరే. క్రీజులో పాతుకపోయి అఫ్గాన్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. వీరిద్దరూ దాదాపు 30 ఓవర్లపాటు బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ పోటాపోటీగా ఫోర్లు దంచారు. ఈ క్రమంలోనే రాహుల్ టెస్టుల్లో 12 శతకం పూర్తి చేశాడు. అయితే, సెంచరీ చేసిన తర్వాతి బంతికే అతను అవుటవడం గమనార్హం. సాయి సుదర్శన్ కూడా తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 81 పరుగుల వద్ద అవుటయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 139 రన్స్ పార్ట్‌నర్‌షిప్ జతచేశారు.

పంత్‌తో కలిసి గిల్

రాహుల్, సుదర్శన్ జోరును కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొనసాగించాడు. ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ముందుగా రాహుల్‌తో కలిసి క్రీజులో పాతుకపోయాడు. రాహుల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్ కూడా గిల్‌కు తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి మరో భారీ భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఒక్కరు తర్వాత ఒక్కరు భారత బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంతో అఫ్గాన్ బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. వారి వ్యూహాల బెడిసికొట్టాయి. గిల్, పంత్ చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. అబ్దుల్ మాలిక్ వేసిన 68వ ఓవర్‌లో పంత్ హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. మరోవైపు, గిల్ కూడా ఫోర్ల మీద ఫోర్లు బాదాడు. ఈ క్రమంలోనే గిల్ సెంచరీ కూడా పూర్తి చేయగా.. పంత్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. వీరిద్దరూ క్రీజులో పాతుకపోవడంతో భారత్ 400 స్కోరుకు చేరువైంది. తొలి రోజు ఆటను అజేయంగా ముగించగా.. గిల్ 103, పంత్ 50 పరుగుల వద్ద ఉన్నారు.


Next Story