మహిళల వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

by Phanindra |

మహిళల వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. భారత్, పాక్ మ్యాచ్‌‌కు కొలంబో వేదిక కానుంది.

మహిళల వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్‌ ఎప్పుడంటే?
X

దిశ, స్పోర్ట్స్: భారత్ వేదికగా ఈ ఏడాది జరగనున్న మహిళల వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. సెప్టెంబరు 30 నుంచి నవంబరు 2 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. సెప్టెంబరు 30న భారత్, శ్రీలంక మ్యాచుతో టోర్నీ మొదలవుతుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగా దెబ్బతినడంతో ఈ రెండు దేశాల మధ్య మ్యాచులను మాత్రం తటస్థ వేదికపై నిర్వహించాలని ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ఐసీసీ నిర్ణయించింన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్, పాకిస్తాన్ మహిళల జట్లు అక్టోబరు 5న కొలంబో వేదికగా తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచులో అక్టోబరు 1న న్యూజిల్యాండ్‌తో తలపడనుంది.


రౌండ్ రాబిన్ మ్యాచులు అక్టోబర్ 26 వరకు జరుగుతాయి. అనంతరం అక్టోబర్ 29, 30 తేదీల్లో సెమీఫైనల్స్, ఆ తర్వాత నవంబరు 2న ఫైనల్స్ నిర్వహించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచులకు గువాహతి, బెంగళూరు స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే నాకౌట్ దశకు పాకిస్తాన్ చేరితే మాత్రం ఈ మ్యాచులు కొలంబోలో జరుగుతాయి. లేదంటే నాకౌట్ మ్యాచులన్నీ భారత్‌లోనే నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్ కన్ఫర్మ్ అవడంతో మహిళల వన్డే వరల్డ్ కప్‌ 13వ ఎడిషన్‌పై ఆసక్తి మరింత పెరుగుతుందని ఐసీసీ చైర్మన్ జై షా అభిప్రాయపడ్డారు. మహిళా క్రికెట్లోని 8 బెస్ట్ టీమ్స్.. ఈ టోర్నీ కోసం భారత్‌కు వస్తాయని, ఈ అద్భుతమైన ఈ మెగా ఈవెంట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తెలిపారు.

రౌండ్ రాబిన్..

ఈ దశలో ప్రతి జట్టు మిగతా ఏడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచుల తర్వాత టాప్-4లో నిలిచిన జట్లు సెమీస్‌ చేరతాయి. అలాగే ప్రతి జట్టు ఈ మెగా ఈవెంట్‌కు ముందు రెండేసి వార్మప్ మ్యాచులు ఆడుతుంది. సెప్టెంబరు 24 నుంచి ఈ వార్మప్ మ్యాచులు మొదలవుతాయి.


Next Story