ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌.. ప్రైజ్‌మనీ‌పై ICC అధికారిక ప్రకటన

by Kema Shiva Kumar |

2026 టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియాపై కాసుల వర్షం కురిసింది. ఈ మేరకు ప్రైజ్ మనీ‌పై ఐసీసీ ఇవాళ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌.. ప్రైజ్‌మనీ‌పై ICC అధికారిక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో టీమిండియా (Team India) మరోసారి తన జైత్రయాత్రను కొనసాగించింది. 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ (New Zealand)ను చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ ఘన విజయంతో టీమిండియాపై కాసుల వర్షం కురుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఈ టోర్నీకి సంబంధించి అధికారిక ప్రైజ్ మనీ వివరాలను వెల్లడించింది.

విజేతకు రూ.27.48 కోట్లు

ఈ ఏడాది ఐసీసీ ప్రైజ్ పూల్‌ను రికార్డు స్థాయిలో పెంచింది. విజేతగా నిలిచిన భారత జట్టుకు 3 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.27.48 కోట్లు బహుమతిగా అందాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒక విజేతకు అందిన అత్యధిక ప్రైజ్ మనీ ఇదే కావడం విశేషం. ఇక ఫైనల్లో భారత్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు 1.6 మిలియన్ డాలర్లు అటే మన కరెన్సీలో రూ.14.65 కోట్లు దక్కాయి. గత ఎడిషన్లతో పోలిస్తే రన్నరప్ జట్టుకు ఇచ్చే బహుమతి మొత్తాన్ని కూడా ఐసీసీ గణనీయంగా పెంచింది.

సెమీఫైనలిస్టులు, ఇతర జట్లకు ఇలా..

సెమీఫైనల్ వరకు వచ్చి ఓటమి పాలైన జట్లకు కూడా ఐసీసీ భారీ మొత్తాన్ని కేటాయించింది. ఇందులో దక్షిణాఫ్రికాకు రూ.7.24 కోట్లు, ఇంగ్లాండ్‌కు రూ.7.24 కోట్లు, సూపర్-8 జట్లలో ఒక్కో జట్టుకు రూ.3.48 కోట్లు, గ్రూప్ స్టేజ్ జట్లలో టోర్నీలో పాల్గొన్న ప్రతి జట్టుకు కనీసం రూ.2.29 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. అదేవిధంగా ఐసీసీ ఇచ్చే ప్రైజ్ మనీ కాకుండా, ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అదనంగా రూ.131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్ మధ్య పంపిణీ చేయనున్నారు. .

Next Story