T20 World Cup : వ్యూస్‌లో ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ సరికొత్త రికార్డు

by Naga Rani Yarlagadda |

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో నిన్న జరిగిన ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ కు జియో హాట్ స్టార్ లో రికార్డుస్థాయి వ్యూస్ వచ్చాయి.

T20 World Cup : వ్యూస్‌లో ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ సరికొత్త రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ లో ఇండియా - పాకిస్తాన్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్.. ఈసారి డిజిటల్ వేదికలపై కూడా కొత్త రికార్డును నమోదుచేసింది. భారీ వ్యూయర్ షిప్ సాధించి.. గత రికార్డులను బ్రేక్ చేసింది. తాజాగా వచ్చిన లెక్కల ప్రకారం.. జియో హాట్ స్టార్ యాప్, వెబ్ సైట్లో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ను 454 మిలియన్ల మంది.. అంటే 45.4 కోట్ల మంది వీక్షించారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీల ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులు ఈ బ్లాక్‌బస్టర్ పోరును ప్రత్యక్షంగా వీక్షించడం ఈ దాయాదుల పోరుకు ఉన్న ఆదరణను మరోసారి నిరూపించింది. అంతకుముందు ఫిబ్రవరి 7, 2026న అమెరికాతో జరిగిన మ్యాచ్‌కు 260 మిలియన్ల వ్యూస్ రాగా, నమీబియాతో జరిగిన పోరుకు 240 మిలియన్ల వ్యూస్ లభించాయి. అయితే, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ సాధించిన గణాంకాలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ.

మూడో స్థానానికి పడిపోయిన పాక్

కొలంబో వేదికగా ఫిబ్రవరి 15, 2026న జరిగిన గ్రూప్-A మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కేవలం 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేసి టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ .. భారత బౌలర్ల ధాటికి 18 ఓవర్లలోనే 114 పరుగులకు ఆలౌట్ అయింది. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలతో కూడిన భారత బౌలింగ్ విభాగం పాక్ బ్యాటర్లను కట్టడి చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల్లో ఆరు పాయింట్లు సాధించిన భారత్.. ఈ టోర్నమెంట్‌లో సూపర్-8 దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండగా, పాకిస్తాన్‌ మూడో స్థానానికి పడిపోయింది. తదుపరి దశకు చేరుకోవాలంటే పాకిస్థాన్ తన తర్వాతి మ్యాచ్‌లో నమీబియాపై తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

Next Story