- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాండ్యా బ్రదర్స్ హ్యాట్సాప్.. గురువుకు అండగా నిలిచిన హార్దిక్, కృనాల్
టీమ్ ఇండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా తమ చిన్ననాటి కోచ్‌కు అండగా నిలిచారు.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా తమ చిన్ననాటి కోచ్‌కు అండగా నిలిచారు. ప్రతి కష్టంలోనూ కోచ్‌కు తోడుగా ఉంటూ తమ గురుభక్తిని చాటుకున్నారు. కోచ్ జితేంద్ర సింగ్ కోచింగ్‌లో పాండ్యా బ్రదర్స్ రాటుదేలారు. స్టార్ క్రికెటర్లుగా ఎదిగారు. కానీ, తమ చిన్ననాటి కోచ్‌ను మాత్రం మరవలేదు. ఆయనకు కష్టం వచ్చిన ప్రతి సందర్భంలోనూ మేమున్నామంటూ నిలబడ్డారు. శుక్రవారం టీచర్స్ డే సందర్భంగా కోచ్ జితేంద్ర సింగ్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాండ్యా చేసిన సాయాన్ని గుర్తు చేసుకున్నాడు. హార్దిక్, కృనాల్ తనకు ఆర్థికంగా అండగా నిలిచారని, దాదాపు రూ.70-80 లక్షలు సాయం చేశారని చెప్పాడు.
నా చెల్లెల్ల వివాహానికి సాయం
పాండ్యా బ్రదర్స్ తన చెల్లెల వివాహానికి సాయం చేశారని జితేంద్ర సింగ్ తెలిపాడు. ‘2018లో నా మొదటి సోదరి వివాహానికి హార్దిక్, కృనాల్ సాయం చేశారు. అంతేకాదు, గతేడాది నా రెండో సోదరి పెళ్లి సమయంలో కారు కొనుక్కొమని రూ. 20 లక్షలు పంపించారు. ‘నీ చెల్లి నాకు చెల్లే. పెళ్లి బాగా చేయండి’అని హార్దిక్ చెప్పాడు’అని తెలిపాడు. అలాగే, తన తల్లి అనారోగ్యానికి గురైనప్పుడు కూడా హార్దిక్ సాయం చేశాడని గుర్తు చేసుకున్నాడు.. ‘2015లో హార్దిక్ ముంబై ఇండియన్స్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పుడు అతన్ని డిస్టర్బ్ చేయొద్దనుకున్నా. కానీ, అతను తిరిగి బరోడా వచ్చిన తర్వాత నన్ను ప్రశ్నించాడు. అమ్మ గురించి చెప్పాను. ‘నా డబ్బు అంతా తీసుకో. అమ్మ కోలుకుంటుంది’అని హార్దిక్ చెప్పాడని తెలిపాడు.
దుస్తులు వారిచ్చినవే
2015-16లో హార్దిక్ తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా టూరుకు సెలెక్ట్ అయ్యాడు. ఆ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన తర్వాత హార్దిక్ కారు కొనుక్కొమని రూ.5-6 లక్షలు ఇచ్చాడని జితేంద్ర తెలిపాడు. ‘2017, 2019 ఐపీఎల్ సీజన్లలో ముంబై ఇండియన్స్ గెలిచినప్పుడు హార్దిక్, కృనాల్ నాకు ఆర్థికంగా సాయం చేశారు. ఈ ఏడాది ఆర్సీబీ గెలిచిన తర్వాత కూడా కృనాల్ రూ.18 లక్షలు ఇచ్చాడు. నేను లోయర్ మిడిలార్డర్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చినవాడినే. అందుకు నన్ను చూసుకుంటున్నారు. నేను వేసుకునే దుస్తులు కూడా వారు గిఫ్ట్‌గా ఇచ్చినవే. లేదంటే నేను కొనుగోలు చేయలేను. అలాంటి శిష్యులు పొందడం నా అదృష్టం’అని జితేంద్ర సింగ్ చెప్పుకొచ్చాడు.






