Hong Kong Open : వరల్డ్ నం.9 ప్లేయర్‌కు షాకిచ్చిన భారత యువ సంచలనం

by Harish |

హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ ఆటగాడు ఆయుశ్ శెట్టి సంచలన ప్రదర్శన చేస్తున్నాడు.

Hong Kong Open : వరల్డ్ నం.9 ప్లేయర్‌కు షాకిచ్చిన భారత యువ సంచలనం
X

దిశ, స్పోర్ట్స్ : హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ ఆటగాడు ఆయుశ్ శెట్టి సంచలన ప్రదర్శన చేస్తున్నాడు. రెండో రౌండ్‌లో వరల్డ్ నం.9కు షాకిచ్చాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆయుశ్ 21-19, 12-21, 21-14 తేడాతో జపాన్‌కు చెందిన కోడై నరోకాను చిత్తు చేశాడు. 31వ ర్యాంకర్ అయిన ఆయుశ్ తనకంటే మెరుగైన ర్యాంక్ కలిగిన ప్రత్యర్థిని ఓడించడానికి శక్తికి మించి పోరాడాడు. గంటా 12 నిమిషాలపాటు మ్యాచ్ సాగింది. పోరాటాన్ని నమ్ముకున్న ఆయుశ్ ఏమాత్రం పట్టుదల కోల్పోలేదు. పోరాడి మరి తొలి గేమును సాధించాడు. అనంతరం నరోకా బలంగా పుంజుకుని దూకుడు ప్రదర్శించడంతో ఆయుశ్ రెండో గేము కోల్పోయాడు. కానీ, నిర్ణయాత్మక మూడో గేములో మాత్రం అతను సంచలన ఆటతీరు ప్రదర్శించారు. ప్రత్యర్థి దూకుడుకు కళ్లెం వేయడమే కాకుండా అసలు పుంజుకునే చాన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో ఏకపక్షంగా మూడో గేము నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకుని క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టాడు. సూపర్ 500 లెవల్ టోర్నీలో ఆయుశ్ క్వార్టర్స్‌కు చేరడం ఇదే మొదటిసారి.

వారు కూడా..

భారత సింగిల్స్ స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ కూడా క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్‌లో అతను మరో భారత స్టార్ హెచ్.ఎస్ ప్రణయ్‌పై విజయం సాధించాడు. మూడో గేములో ఫలితం తేలగా 15-21, 21-18, 21-10 తేడాతో సేన్ గెలుపొందాడు. ఆరు నెలల కాలంలో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూరు ఈవెంట్‌లో సేన్ తొలిసారిగా క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇక, ఇటీవల వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన భారత డబుల్స్ స్టార్ ప్లేయర్లు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలు తమ జోరు కొనసాగిస్తున్నారు. హాంకాంగ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. రెండో రౌండ్‌లో ఈ భారత జంట 18-21, 21-15, 21-11 తేడాతో థాయిలాండ్‌కు చెందిన సుక్ఫున్-తీరరత్సకుల్ జోడీని ఓడించింది. ముందుగా తొలి గేము కోల్పోవడంతో సాత్విక్ జోడీకి మ్యాచ్‌లో శుభారంభం దక్కలేదు. ఆ తర్వాత దూకుడు పెంచి వరుసగా 2, 3 గేములను ఏకపక్షంగా గెలవడంతో మ్యాచ్ సొంతమైంది.


Next Story