Hockey Asia Cup : చైనాను చిత్తుగా ఓడించిన భారత్.. 9వ సారి ఫైనల్‌లో అడుగు

by Harish |

భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.

Hockey Asia Cup : చైనాను చిత్తుగా ఓడించిన భారత్.. 9వ సారి ఫైనల్‌లో అడుగు
X

దిశ, స్పోర్ట్స్ : భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. చివరి సూపర్-4 మ్యాచ్‌లో చైనాను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం బిహార్‌లో జరిగిన మ్యాచ్‌లో చైనాపై 0-7 తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. ఆరంభం నుంచే భారత్ మ్యాచ్‌ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంది. 3వ నిమిషంలో లక్రా శిలానంద్ చేసిన గోల్‌తో భారత్ జోరు మొదలైంది. ఆ తర్వాత దిల్‌ప్రీత్ సింగ్, మన్‌దీప్ సింగ్, రాజ్‌కుమార్ పాల్, సుఖ్‌జీత్ సింగ్ ఆ జోరును కొనసాగించారు. చెరో గోల్ చేశారు. దీంతో మూడో క్వార్టర్ ముగిసే సరికి భారత్ 5-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక, చివరి క్వార్టర్‌లో అభిషేక్ రెండు గోల్స్ చేసి ఆధిక్యాన్ని 7-0కు పెంచాడు.భారత్ దూకుడు ముందు పూర్తిగా తేలిపోయిన చైనా చివరి వరకూ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. ఆసియా కప్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించడం భారత్‌కు ఇది 9వ సారి. ఈ ప్రదర్శన టోర్నీలో భారత్ తిరుగులేని రికార్డును తెలియజేస్తుంది. మరో మ్యాచ్‌లో మలేసియాపై 3-4 తేడాతో సౌత్ కొరియా గెలిచి ఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆదివారం ఫైనల్‌లో సౌత్ కొరియాతో భారత్ తలపడనుంది.

జపాన్‌తో మహిళల జట్టు డ్రా

మహిళల ఆసియా కప్‌లో భారత మహిళల హాకీ జట్టు తమ రెండో మ్యాచ్‌లో తృటిలో ఓటమి నుంచి బయటపడింది. అతి కష్టం మీద జపాన్‌తో 2-2 డ్రా చేసుకుంది. ఆఖరి నిమిషంలో నవ్‌నీత్ గోల్ చేయడంతో భారత్‌కు ఓటమి గండం తప్పింది. ముందు నుంచి ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. 10వ నిమిషంలో జపాన్ తొలి గోల్ చేయగా.. 30 నిమిషంలో భారత్ తరపున రుతుజ గోల్ చేసింది. ఇక, 58వ నిమిషంలో జపాన్ మరో గోల్ చేసి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ ముగిసే సమయంలో ప్రత్యర్థి గోల్ చేయడంతో భారత్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. మరో రెండు నిమిషాల్లో గోల్ చేయాలి. లేదంటే ఓటమి తప్పదు. ఈ పరిస్థితుల్లో ఆఖరి నిమిషంలో నవ్‌నీత్ గోల్ చేసి భారత్‌‌ను ఓటమి నుంచి తప్పించింది. సోమవారం చివరి గ్రూపు మ్యాచ్‌లో సింగపూర్‌తో తలపడనుంది. తర్వాతి రౌండ్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం భారత్‌కు తప్పనిసరి.


Next Story