వన్డే వరల్డ్ కప్‌ అందుకున్న భారత్‌.. విజయోత్సవం మధ్యలో హృదయాన్ని హత్తుకునే సన్నివేశం

by Malleboina Mahesh |   (  Updated:2025-11-03 06:13:47  IST  )

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్లో గెలిచిన భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. భారత ఉమెన్స్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది.

వన్డే వరల్డ్ కప్‌ అందుకున్న భారత్‌.. విజయోత్సవం మధ్యలో హృదయాన్ని హత్తుకునే సన్నివేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్లో గెలిచిన భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. భారత ఉమెన్స్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా ఆనంద సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే, ఈ జయోత్సవం మధ్యలో హృదయాన్ని హత్తుకున్న క్షణం ఒకటి చోటు చేసుకుంది. ఈ టోర్నీలో భీకర ఫామ్ కనబరిచి.. భరత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి.. గాయాల కారణంగా టోర్నమెంట్‌ నుంచి తప్పుకున్న ఓపెనర్‌ ప్రతీకా రావల్, వీల్‌చైర్‌పై కూర్చుని మైదానంలోకి వచ్చి తన జట్టుతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు.

ప్రతీకా టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచినా, చివరి లీగ్‌ మ్యాచ్‌లో గాయపడి ఆడే అవకాశం కోల్పోయింది. ఆమె స్థానంలో వచ్చిన శెఫాలి వర్మ ఫైనల్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సత్తా చాటింది. 87 పరుగులు చేసి, రెండు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించింది. మ్యాచ్‌ అనంతరం ప్రతీకా భావోద్వేగంగా మాట్లాడుతూ, “నా భుజంపై ఉన్న ఈ జెండా నాకు గర్వకారణం. ఈ జట్టుతో ఉండటం కలలాంటిది. మేము నిజంగా చరిత్ర సృష్టించాం” అని తెలిపింది. అంతకు ముందు భారత ప్లేయర్లు మొత్తం ప్రతీకా రావల్ ను గ్రౌండ్ లోకి తీసుకొచ్చి ఆమె చుట్టూ చేసి సంబరాలు చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికి భారత మహిళల జట్టు ఈ విజయంతో ప్రపంచవ్యాప్తంగా భారత క్రీడా గర్వాన్ని మరింత ఎత్తుకు చేర్చింది.

Next Story