తెలంగాణ‌లో ఐపీఎల్ తరహాలో టీ20 లీగ్.. ఎల్లుండే అఫీషియల్‌గా లాంచ్

by Harish |

తెలంగాణ‌లో ఐపీఎల్ తరహాలో టీ20 లీగ్.. ఎల్లుండే అఫీషియల్‌గా లాంచ్
X

దిశ, స్పోర్ట్స్ : తెలంగాణలో ఐపీఎల్‌ తరహాలో టీ20 లీగ్‌కు తెరలేవనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) టీజీ టీ20 లీగ్ పేరుతో ఈ టోర్నీని నిర్వహించబోతోంది. ఈ ఏడాది జూన్-జూలైలో తొలి సీజన్‌ను నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ నెల 29న హెచ్‌సీఏ అధికారికంగా ఈ టోర్నీని లాంచ్ చేయనుంది. రాష్ట్రంలో దేశీయ క్రికెట్ స్వరూపాన్ని మార్చే లక్ష్యంగా హెచ్‌సీఏ ఈ టోర్నీని నిర్వహించనుంది. జిల్లాల్లోని యువ క్రికెటర్లలోని ప్రతిభను గుర్తించడానికి, ఐపీఎల్‌లాంటి టోర్నీలకు వెళ్లడానికి వారికి ఓ మార్గాన్ని చూపడం కూడా హెచ్‌సీఏ ఉద్దేశం. ఈ లీగ్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా.. ఫ్రాంచైజీ ఓనర్‌షిప్ కోసం ఇప్పటికే బిడ్డింగ్ ప్రాసెస్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని పలు కార్పొరేట్ సంస్థలు బిడ్ వేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. బిడ్ వేసేందుకు నేడే ఆఖరి రోజు.

ఒక టీమ్ కనీస ధర రూ.3 కోట్లు

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ లీగ్‌లో ప్రాతినిధ్యం ఉండేలా హెచ్‌ఎస్ఏ ప్లాన్ చేసింది. ఉమ్మడి జిల్లాల పేర్లతో ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయనుంది. హెచ్‌సీఏ ప్రతిపాదించిన ఫ్రాంచైజీ పేర్లలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ ఉన్నాయి. బిడ్డింగ్ ద్వారా ఇందులో నుంచి 8 జట్లను ఖరారు చేస్తారు. ఒక టీమ్‌ను సొంతం చేసుకోవడానికి హెచ్‌సీఏ కనీస బిడ్ ధరను రూ.3 కోట్లుగా నిర్ణయించింది. అత్యధిక బిడ్ వేసిన వారికి ఫ్రాంచైజీని ఎంచుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ముందుగా ఫ్రాంచైజీ ఓనర్‌షిప్ రైట్స్‌ను 5 ఏళ్ల కాలానికి ఇస్తారు. ఆ తర్వాత ప్రతి మూడేళ్లకోసారి రెన్యూవల్ చేస్తారు. ఈ నెల 30న షార్ట్‌లిస్ట్ చేసిన ఫ్రాంచైజీలను ప్రకటించనున్నారు.

లీగ్‌లో 32 మ్యాచ్‌లు

ఈ టోర్నీని రాబిన్ రౌండ్, ప్లే ఆఫ్స్ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. మొత్తం 8 జట్లు 32 మ్యాచ్‌లు ఆడతాయి. ప్రతి రోజు రెండు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అన్ని మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలోనే జరగనున్నట్టు హెచ్‌సీఏ వెల్లడించింది.

Next Story