ఆసియా కప్‌లో ఓవరాక్షన్.. హరిస్ రవూఫ్‌‌పై నిషేధం విధించిన ఐసీసీ

by Harish |

పాకిస్తాన్ బౌలర్ హరిస్ రవూఫ్‌కు ఐసీసీ షాకిచ్చింది.

ఆసియా కప్‌లో ఓవరాక్షన్.. హరిస్ రవూఫ్‌‌పై నిషేధం విధించిన ఐసీసీ
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ బౌలర్ హరిస్ రవూఫ్‌కు ఐసీసీ షాకిచ్చింది. అతనిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. ఆసియా కప్‌లో అతని దుష్ర్పవర్తన కారణంగా తాజాగా చర్యలు తీసుకుంది. సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో రవూఫ్ అతిగా ప్రవర్తించాడు. రెండుసార్లు ఐసీసీ ప్రవర్తనా నియామళిలోని ఆర్టికల్ 2.21ను ఉల్లంఘించాడు. సెప్టెంబర్ 14న జరిగిన గ్రూపు దశ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలను దుర్భాషలాడాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఐసీసీ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించడంతోపాటు రెండు డీమెరిట్ పాయింట్స్ ఇచ్చింది.

సెప్టెంబర్ 21న జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో అతను మరింత ఓవరాక్షన్ చేశాడు. భారత్‌కు చెందిన ఆరు రఫెల్ జెట్ ఫ్లైట్స్‌ను కూల్చామని సంజ్ఞలు చేశాడు. దీంతో మరోసారి అతనిపై చర్యలు తీసుకున్న ఐసీసీ మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా, రెండు డీమెరిట్ పాయింట్స్ కేటాయించింది. దీంతో రవూఫ్ ఖాతాలో 4 డీమెరిట్ పాయింట్స్ చేరాయి. 24 నెలల వ్యవధిలో 4 డీమెరిట్ పాయింట్స్ లభిస్తే సదరు ప్లేయర్‌పై ఐసీసీ ఒక్క టెస్టు మ్యాచ్ లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20లు నిషేధం విధించొచ్చు. ఈ కారణంగానే ఐసీసీ రవూఫ్‌పై వేటు వేసింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మంగళవారం జరిగిన తొలి వన్డే అతను ఆడలేదు. 6న జరిగే రెండో వన్డేకు కూడా అతను దూరంకానున్నాడు.


Next Story